Read more!

గ్రేటర్ కు బీజేపీ బడా నేతలు! కారు ఖేల్ ఖతమేనా? 

కారు పార్టీకి కౌంట్ డౌన్  మొదలైనట్టేనా? గ్రేటర్ ఎన్నికతో గులాబీ బాస్ కు చెక్ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బడా నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలదళం..  మరో మూడేళ్లలో జరగనున్న అసెంబ్లీ సమరానికి..జీహెచ్ఎంసీ ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తోంది. గ్రేటర్ లో పాగాతో తమ లక్ష్యానికి చేరుకునేలా కార్యాచరణ రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ప్రచారానికి పార్టీ అగ్రనేతలను  రంగంలోకి దింపుతోంది. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికను బీజేపీ హైకమాండ్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తుందంటే వాళ్లు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ‍న్డీయేను విజయతీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ ను గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా నియమించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసి రాష్ట్ర నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు భూపేంద్ర యాదవ్‌. లోకల్ బాడీ ఎన్నికకు జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్ గా పేరున్న భూపేంద్రను ఇంచార్జ్ గా పంపించిన హైకమాండ్.. అంతటితో ఆగడం లేదు. కేంద్రమంత్రులను హైదరాబాద్ ప్రచారానికి పంపిస్తోంది. రెండు రోజుల క్రితమే గ్రేటర్ లో ప్రచారం చేసి వెళ్లారు ప్రకాశ్ జవదేకర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఆయన చార్జీషీట్ విడుదల చేశారు. కేసీఆర్ పాలనపై, టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ప్రకాశ్ జవదేకర్. 

 

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కూడా రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్నారు. ఛేంజ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్ పెట్టి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తేజస్వి సూర్య. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని  తేజస్వి సూర్య అన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్‌ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు సూర్య. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం గ్రేటర్ లో ప్రచారం చేయబోతున్నారు. స్మృతికి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉండటంతో ఆమెకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. 

 

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ పాటు మరికొంతమంది నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. గ్రేటర్ లో పాగా వేస్తే దక్షిణాదిలో పార్టీకి ఫుల్ జోష్ వస్తుందని బీజేపీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు. గౌతమ్ గంభీర్, సైనా నెహ్వాల్, కుష్భు లు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం లో పాల్గొననున్నారు తెలుస్తోంది. అవసరమైతే మరికొందరు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలను హైదరాబాద్ పంపించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట.  బీజేపీ వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే స్థానిక ఎన్నికలను పెద్దగా పట్టించుకోని సీఎం కేసీఆరే స్వయంగా జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారని, గ్రేటర్ ప్రజలకు వరాలు కురిపించారని చెబుతున్నారు. వరాలు ఇవ్వడమే కాదు బీజేపీ గెలిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ ఓటర్లను భయాందోళన కల్గించే ప్రయత్నం చేశారు కేసీఆర్. బీజేపీ దూకుడుతో గులాబీ నేతల్లో గుబులు పెరిగిపోతుందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి జోష్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌ లోనూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోంది బీజేపీ రాష్ట్ర నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది.  బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్‌రావుతో సహా రాష్ట్ర స్థాయి నేతలంతా హైదరాబాద్‌లోనే ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.