అస్త్రశస్త్రాలతో ప్రతిపక్షాలు సిద్ధం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అధికార పక్షం అసమర్థతను నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలపై సర్కారు తీరును ఎండగట్టేందుకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వ తీరును కడిగి పారేసేందుకు ఇప్పటికే టీడీపీ స్ట్రాంగ్ ఎక్సర్ సైజ్ చేసినట్టు సమాచారం. మాటల తూటాలు విసిరే రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ఇదే అంశంపై గట్టిగా ప్రిపేరైనట్టు చెబుతున్నారు. అటు బీజేపీ తరపున కిషన్ రెడ్డి. డాక్టర్ లక్ష్మణ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యంపై గణాంకాలతో సిద్ధంగా ఉన్నారట. ఇక కాంగ్రెస్ కూడా తక్కువేం తినలేదు. సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ఆ టీమంతా రెడీగా ఉంది. అన్నింటికి మించి టీఆర్ఎస్ తో సత్సంబంధాలు ఉన్న ఎంఐఎం సైతం సర్కారుపై వాగ్బాణాలు వేసేందుగా సిద్ధంగా ఉందట. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ముప్పేట దాడిని తప్పించుకోవడం కేసీఆర్ సర్కారు వల్ల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.