జెడ్పీ ఛైర్మన్‌ వర్సెస్ కలెక్టర్... టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న కొత్త వివాదం 

 

ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది.

కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.