TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జికా వైరస్‌ మన దేశానికి వచ్చేస్తోంది

Published on: Sat Mar 12, 2016 4:10PM

ప్రపంచాన్నంతా వణికిస్తున్న జికా వైరస్‌ ఇప్పుడు మన దేశంలోకి రానుంది. అయితే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు! ఎందుకంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని పరీక్షల కోసం జికా వైరస్‌ నమూనాను అమెరికా నుంచి తెప్పిస్తోంది, అంతే! భారతదేశంలో ఇప్పటివరకూ జికావైరస్‌కు సంబంధించి ఎటువంటి కేసులూ నమోదు కాలేదు. అయితే ఆ ఆ వైరస్‌ను గుర్తించేందుకు అవసరమయ్యే యంత్రాంగం మాత్రం మన దగ్గర ఉంది. అది సరిగా పనిచేస్తోందో లేదో తెలుసుకునేందుకే, జికా వైరస్‌ను అమెరికాను నుంచి తెప్పిస్తున్నారు. ఈ నమూనాలు మన దేశాన్ని చేరుకోగానే, వాటని నేరుగా భారతీయ వైద్య పరిశోధనా సంస్థకు పంపించనున్నారు.

ప్రస్తుతానికి మన దేశంలో జికా కేసులు నమోదు కానప్పటికీ, ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఈడిస్‌ దోమలు మన దేశంలో విస్తృతంగా ఉండటం, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈడిస్‌ దోమల వల్ల చికెన్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు మన దేశంలో వేలాదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ దోమలు జికా వైరస్‌ను కూడా మోయడం మొదలుపెడితే, పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. జికా వైరస్‌ వల్ల ప్రాణానికి ఏమీ నష్టం లేకపోయినప్పటికీ, గర్భిణీ స్త్రీలను కనుక ఈ దోమలు కుడితే, వారికి పుట్టే సంతానంలో మెదడుకి సంబంధించిన లోపాలు బయటపడే అవకాశం ఉంది.