TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జికా వైరస్‌కు తెలుగువాడి సవాల్‌!

Published on: Thu Feb 4, 2016 8:52AM

 

ఆఫ్రికా నుంచి అమెరికా వరకూ దేశదేశాలనే వణికిస్తున్న జికా వైరస్‌ ఒక హైదరాబాద్‌ సంస్థ టీకాను కనుగొంది! వైరస్‌ను అడ్డుకునేందుకు ఏం చేయాలో తెలియక పిల్లల్ని కనవద్దన్నీ, రక్తదానాలు చేయవద్దనీ ప్రభుత్వాలే చెబుతున్న సమయంలో ఒక తెలుగు సంస్థ జికాకి టీకాను రూపొందించేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అనే ఔషధ సంస్థ జికాకు టీకాను తయారుచేసే ప్రక్రియలో తుదిదశకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ కృష్ణ ఎల్ల నిన్న ఒక విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జికా వైరస్‌కు ఇది ప్రపంచంలోనే తొలి టీకా అవుతుందనీ, ఆ మేరకు తాము పేటెంట్‌ని సైతం దాఖలు చేశామని కృష్ణ తెలియచేవారు. 2014లో జికా నిదానంగా విజృంభిస్తున్న సమయంలోనే ఈ సంస్థ దాని ప్రమాదాన్ని గ్రహించింది. అప్పటి నుంచే జికాకు విరుగుడుగా టీకాను కనుగొనేందుకు ప్రయత్నాలు ఆరంభించింది.

 

అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం తమ దాకా వస్తే చూసుకోవచ్చులే అనుకుని నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ముందుచూపుతో వ్యవహరించింది ‘భారత్‌ బయోటెక్‌’. భారత ప్రభుత్వం కనుక ఈ టీకాను సత్వర అనుమతులు అందిస్తే కేవలం రెండేళ్లలోనే దీనిని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకురాగలమని చెబుతోంది ఈ సంస్థ. జికా వైరస్‌కు టీకాను కనుగొనేందుకు అమెరికాలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ… అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఒకవేళ ఆ పరిశోధనలు ఫలించినా వారి మందు సామాన్యులకి అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పడుతుందని అంచనా. మరో వైపు జికా విజృంభిస్తూ ఒకో దేశాన్నీ దాటుకుంటూ ప్రపంచాన్నే చుట్టుముడుతోంది. జికా వైరస్‌ వల్ల బ్రెజిల్‌ దేశంలో వేలమంది పిల్లలు మెదడుకి సంబంధించిన తీవ్రమైన లోపాలతో పుడుతున్నారు. ఇలాంటి సందర్భంలో జికాకు విరుగుడు కనుక్కోవడం అంటే ప్రజల నెత్తిన పాలు పోయడమే!