దోమలని చంపేందుకు 2,20,000 సైనికులు!
Published on: Thu Feb 4, 2016 11:41AM

జికా వైరస్ వ్యాప్తిని ఎలాగైనా ఆపేందుకు చాలా ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగానే బ్రెజల్ దేశం రెండు లక్షలమందికి పైగా సైనికులను జికా వైరస్ మీద పోరాటం కోసం వినియోగించనుంది. ఈడిస్ అనే దోమ ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది బ్రెజిల్ ప్రభుత్వమే. బ్రెజల్ దేశంలో రోజురోజుకీ వందల మంది జికా వైరస్ బాధితులు బయటపడుతున్నారు. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే బాధితుల సంఖ్య లక్షల్లోకి చేరుకునే ప్రమాదం ఉందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో ఈడిస్ దోమలని చంపేందుకు ఉన్న అవకాశాలు అన్నింటినీ కూడా బ్రెజిల్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈడిస్ దోమని చంపేందుకు వాడవాడలా దోమల మందుని చల్లడం, జికా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం… వంటి చర్యలని చేపట్టేందుకు ఇప్పడు బ్రెజిల్ తన సైనికులను ఉపయోగించనుంది. అయితే వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెదవి విరుస్తున్నారు కొందరు. ఈ దోమల మందు ఈడిస్ పెట్టిన గుడ్ల మీద పెద్దగా ప్రభావం చూపదనీ, పైగా ఈడిస్ దోమ పగటి పూటే ఎక్కువగా కుడుతుంది కాబట్టి, దాని నుంచి తప్పించుకోవడం తేలిక కాదనీ అంటున్నారు. మరి పెద్ద పెద్ద శత్రువులతోనే యుద్ధం చేసే సైనికులు ఈ చిన్న దోమల మీద ఏమాత్రం విజయం సాధిస్తారో చూడాలి!


