TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జికా వైరస్‌కు టీకా ఇప్పట్లో లేనట్లేనా!

Published on: Tue Feb 9, 2016 12:05PM

హైదరాబాదుకు చెందిన భారత్‌ బయోటెక్ సంస్థ తాను జికాకు టీకాకు కనుగొన్నానని ప్రపంచానికి సగర్వంగా చాటింది. ఈ టీకాని ప్రయోగించే దశ చివరికి చేరుకుందనీ, ప్రభుత్వం నుంచి కనుక త్వరత్వరగా అనుమతులు లభిస్తే మరో రెండేళ్లలోనే విపణిలోకి తీసుకురాగలమని చెప్పింది. అయితే ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రస్తుతం చుక్కెదురైంది. భారతదేశంలోని ఔషధ పరిశోధనలను నియంత్రించే ‘ఇండియన్ కౌన్సల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ICMR) భారత్‌ బయోటెక్ సాధించిన ప్రగతితో అంతగా తృప్తి చెందినట్లు కనిపించడం లేదు. జికా టీకా ఎలా పనిచేస్తుందో తమకి స్పష్టత కలగడం లేదనీ, మరింత సమాచారంతో తమ వద్దకు రమ్మని ICMR, భారత్ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులకు సూచించిందట. అంతేకాదు! తాము నిబంధనల మేరకే అనుమతులు ఇస్తామనీ, త్వరత్వరగా అనుమతులని అందించే ప్రసక్తే లేదని ICMR ఉన్నతాధికారి సౌమ్యా స్వామినాధన్‌ కుండబద్దలు కొట్టేశారు. దాంతో ‘సాధారణ ప్రక్రియ’ ప్రకారమే జికా వైరస్‌కు టీకా రూపొందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని వల్ల ఈ టీకా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. జికా టీకాను ICMR నిలువరించడానికి కారణం ముందస్తు జాగ్రత్తా లేకపోతే ప్రభుత్వ సంస్థలతో కనిపించే నిస్తేజమా అన్నది తెలియడం కష్టం. ఏదేమైనా ఈ టీకా ఆలస్యం అయ్యేకొద్దీ లక్షల మంది ప్రజలు మాత్రం ప్రమాదపు అంచున ఉంటారన్నది మాత్రం వాస్తవం.