TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంకో లెవెల్‌.. లాలా భీమ్లా.. అయ్యో జ‌గ‌నా..

Published on: Fri Feb 25, 2022 10:35AM

లా..లా.. భీమ్లా.. అయ్యో జ‌గ‌నా.. థియేట‌ర్ల‌లో ఈ సాంగ్ మారుమోతుతోంది. భీమ్లా నాయ‌క్‌.. ఇంకో లెవెల్‌లో ఉందంటున్నారు. ప‌వ‌ర్ స్టార్ రేంజే వేరంటున్నారు. మేం ట్రెండ్ ఫాలో అవం.. ట్రెండ్ సెట్ చేస్తాం.. అంటున్నారు ఫ్యాన్స్‌. తొడ‌కొట్ట‌కుండా.. క‌త్తుల‌తో న‌ర‌క్కుండా.. డైలాగ్స్‌తో బాక్సాఫీస్‌ రికార్డులు వేటాడేస్తాం అంటున్నారు. భీమ్లా నాయ‌క్.. జ‌స్ట్‌ హిట్ కాదు.. సూప‌ర్ హిట్‌.. బంప‌ర్ హిట్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌.. అంటున్నారు. ఫ్యాన్స్ అదో మైకంలో తేలియాడుతున్నారు.. పూన‌కాల‌తో ఊగిపోతున్నారు.. అరుపులు, కేక‌లు, నినాదాల‌తో.. హోరెత్తిస్తున్నారు. పీకేను కానీ, ఆయ‌న‌ ఫ్యాన్స్‌ను కానీ ఆప‌డం ఇప్పుడిక‌ ఎవ‌రి త‌రం కాదంటున్నారు.

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో హిట్ కొట్టినా.. అదంత మాస్ మూవీ కాదు. క్లాస్ అండ్ నీట్ పిక్చ‌ర్‌. అందులో ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే సీన్స్ చాలా త‌క్కువ‌. కానీ, భీమ్లా నాయ‌క్ అలా కాదు. అంత‌కుమించి. వేరే లెవెల్‌. మాంచి డ‌బుల్ మ‌సాలా ధ‌మ్ బిర్యానీ తిన్న‌ట్టుంది.. అప్పుడే కాసిన నాటు సారా పీక‌లదాకా తాగిన‌ట్టుంది.. ప‌చ్చి మిర‌ప‌కాయ్ కొరికిన‌ట్టుంది.. పీకే అంటే ఫైర్‌.. త‌గ్గేదేలే..దంటున్నారు ఫ్యాన్స్‌.

జ‌గ‌న్‌రెడ్డి ఎన్ని కుట్ర‌లు చేశారు? ఎంత‌గా వేధించారు? అప్పుడు వ‌కీల్ సాబ్‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూశారు.. కానీ వ‌ర్క‌వుట్ కాలే. ఇప్పుడు భీమ్లా నాయ‌క్‌పైనా రివేంజ్ తీసుకోవాల‌ని ట్రై చేశారు.. కానీ అంత సీన్ లే. పీకేను ట‌చ్ కూడా చేయ‌లేక‌పోతోంది జ‌గ‌న్ స‌ర్కార్‌. 

భీమ్లా రిలీజ్‌కు ముందు అధికారులు థియేట‌ర్ల య‌జ‌మాన్యాన్ని బెదిరించారు. ఎగ్జిబిట‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. టికెట్ రేట్లు పెంచొద్ద‌ని.. పెంచితే థియేట‌ర్ సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ముందుగానే నోటీసులు పంపించారు.. భీమ్లా నాయ‌క్ క‌లెక్ష‌న్ల‌ను దెబ్బ‌కొట్టి.. ఫ్యూచ‌ర్‌లో ప‌వ‌న్‌తో సినిమా తీసేందుకు నిర్మాత‌లు ముందుకు రాకుండా చేసి.. జ‌న‌సేనాని ఆర్థిక మూలాలు దెబ్బ‌కొట్టాల‌నేదే జ‌గ‌న్ ఎత్తుగ‌డ అంటున్నారు. బెనిఫిట్ షోలు వేయ‌నీయ‌కుండా అడ్డుకోగ‌లిగారు.. ఐదో షోను అనుమ‌తి ఇవ్వ‌కుండా చేయ‌గ‌లిగారు.. టికెట్ రేట్లు పెంచ‌కుండా క‌ట్ట‌డి చేశారు.. కానీ, ఏం సాధించారు? సినిమా సూప‌ర్‌ హిట్‌ను అడ్డుకోగ‌లిగారా? ప‌వ‌న్ స్టార్‌డ‌మ్‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగారా? ఎక్కువ‌లో ఎక్కువ లాభాల‌ను త‌గ్గించ‌గ‌ల‌రు అంతేగా! వారం రోజుల్లో రావాల్సిన‌ క‌లెక్ష‌న్స్‌.. 10 రోజుల్లో వ‌స్తాయ్‌.. అంతేగా. 100 కోట్ల మార్క్‌కు రీచ్ కావ‌డానికి.. మ‌హా అంటే ఇంకో వారం ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది అంతేగా. అంత‌కంటే జ‌గ‌న్‌రెడ్డి ఏం చేయ‌గ‌ల‌రు అంటున్నారు పీకే ఫ్యాన్స్‌.

ఇక‌, గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లోనైతే ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రో ప్ర‌య‌త్నం కూడా చేశారు. నాగార్జున క‌ళామందిర్ థియేట‌ర్ల‌లో ప్ర‌త్యేకంగా హుండీ ఏర్పాటు చేశారు. టికెట్ రేట్లు త‌గ్గించ‌డం వ‌ల్ల‌.. థియేట‌ర్ య‌జ‌మాని, డిస్టిబ్యూట‌ర్ న‌ష్ట‌పోకుండా ఉండేందుకు.. ఆ హుండీ ద్వారా వ‌చ్చిన సొమ్మును వారికి అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ దేవుడ‌ని భావించే అభిమానులు, సినిమాకు వ‌చ్చిన వారు.. త‌మ‌కు తోచినంత ఆ హుండీలో వేస్తున్నారు. ఇది చాల‌దా.. జ‌గ‌న్‌రెడ్డి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఏం పీ.... చెప్ప‌డానికి.. అంటున్నారు ఫ్యాన్స్‌.