డీజీపీపై కధనంతో ‘జీ-24గంటలు’ హడావుడి

 

సంచలన వార్తల కోసం మీడియా ఆరాటం వలన మీడియా కూడా ఇబ్బందులో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ‘జీ-24గంటలు’ కూడా అటువంటి చిక్కుల్లోనే పడింది. మూడు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డి హైదరాబాదు, ఫతెహ్ దర్వాజా వద్ద ఉండే బాబా హబీబ్ ముస్తఫా ఇబ్రూస్ ను కలసినపుడు, వారిరువురి పరువుకు భంగం కల్గించే రీతిలో ఒక ప్రత్యేక కధనం‘జీ-24గంటలు’ చానల్ ప్రసారం చేసింది.

 

అందుకోసం కొంత మార్ఫ్ చేయబడిన వీడియో ఫుటేజ్ ను కూడా వాడినట్లు గమనించిన సిటీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యం.సుబ్బారావు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ‘జీ-24గంటలు’ పై సెక్షన్ 469 క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసారూ.అదే విధంగా బాబా కుటుంబ సభ్యులు హుస్సేనీ ఆలం పోలీసు స్టేషనులో ‘జీ-24గంటలు’ చానల్ పై పిర్యాదు చేయడంతో‘జీ-24గంటలు’ పై మరో మరో కేసు కూడా నమోదు చేసారు.

 

‘జీ-24గంటలు’ కధనంపై ఆగ్రహించిన బాబా అనుచరులు కొందరు ఖైరతాబాద్ వద్దగల ‘జీ-24గంటలు’ కార్యాలయం వద్దకు చేరుకొని చానల్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ లోపలకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొని శాంతింప జేశారు. కానీ  ‘జీ-24గంటలు’ చానల్ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడానికి బయలుదేరాన్నసమాచారంతో నగరంలో మిగిలిన మీడియా ప్రతినిధులు కూడా వెంటనే చానల్ కార్యాలయం వద్దకు చేరుకొని, పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ కాసేపు ట్రాఫిక్ ను కూడా స్తంభింపజేసారు. అయితే పోలీసులు తాము ఎవరినీ అరెస్ట్ చేయడానికి రాలేదని, కేవలం చానల్ లో ప్రసారమయిన వీడియో గురించి ప్రశ్నించడానికే మాత్రమే వచ్చామని నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది.