TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒవైసీకి ఎన్ఎస్జీ క‌మెండోల భద్రత.. కేంద్ర హోంశాఖ స్పెష‌ల్ సెక్యూరిటీ..

Published on: Fri Feb 4, 2022 12:11PM

ఎంఐఎం పార్టీ అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీపై కాల్పుల ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. ముస్లిం వ‌ర్గానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిన ఓవైసీపై ఫైరింగ్ అంటే.. అది ఆ మ‌తంమైనే దాడిగా భావించే ప్ర‌మాదం ఉంది. అందులోనూ, బీజేపీ అధికారంలో ఉండి, యోగి సీఎంగా ఉన్న చోట ఓవైసీకీ ఏమైనా జ‌రిగితే ఇంకేమైనా ఉందా? ఆగ‌మాగ‌మే. అందుకే, అస‌దుద్దీన్ కారుపై జ‌రిగిన‌ కాల్పులను చాలా సీరియ‌స్‌గా తీసుకుంది కేంద్ర ప్ర‌భుత్వం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు సైతం ముమ్మ‌ర ద‌ర్యాప్తు చేప‌ట్టింది. 

మ‌రోవైపు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పీఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆరుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమెండోలు, పోలీసులతో సహా 22మంది సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎస్కార్టు కారుతో పాటు ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు. 

అయితే, తాను ఎప్పుడూ భద్రతను కోరుకోలేదని.. ఎందుకంటే తన ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఒవైసీ అంటున్నారు. మ‌రోవైపు, ఓవైసీకి కేంద్ర‌హోంశాఖ క‌ల్పించిన భ‌ద్ర‌త‌పైనా ప‌లు కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు. త‌మ ర‌హ‌స్య స్నేహితుడు ఎంత భ‌ద్రంగా ఉంటే బీజేపీ అంత భ‌ద్రం అంటూ సెటైర్లు వేస్తున్నారు.