TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ నిధుల ఆచూకీ చెప్పండి: వైవీబీ లేఖ

Published on: Wed Feb 2, 2022 4:41PM

ఏపీలోని సుమారు 13 వేల గ్రామపంచాయతీలకు వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు ఏమయ్యాయో వెల్లడించాలని ఏపీ పంచాయతీరాజ్, ఆర్థిక, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు Y.V.B. రాజేంద్రప్రసాద్ లేఖ రాశారు. 2019 -20,  2020 -21,  2021-22 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 7 వేల 6 వందల 60 కోట్ల రూపాయలు వచ్చాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ నిధులను ఎలా వినియోగించారో వివరాలు వెల్లడించాలని తన లేఖలో వైవీబీ కోరారు.

2019 నుంచి 22 వరకు మూడు ఆర్ధిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద ఏపీలోని మొత్తం గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు విడుదల చేసింది? ఆయా ఆర్ధిక సంవత్సరాల వారీగా పూర్తి వివరాలు పంపించాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులను వైవీబీ కోరారు. 2019 నుండి 2022 వరకు కేంద్రం విడుదల చేసిన ఆర్ధిక సంఘం నిధులలో ఎన్ని నిధులు గ్రామ పంచాయతీలకు జమ చేశారో? పూర్తి వివరాలు పంపించాలని అడిగారు. 14, 15వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి విద్యుత్ చార్జీలు, విద్యుత్ బకాయిల కింద ఎంత మొత్తం చెల్లించారో వివరాలు కావాలని కోరారు. 

2019 నుండి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత మొత్తం ఖర్చు చేశారో  పూర్తి వివరాలు పంపించాలని అడిగారు.

2019 ఏప్రిల్ 1 నుండి 2022 జనవరి 31 నాటికి రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు కలిపి విద్యుత్ బకాయిలు ఎంత చెల్లించారు? అని వైవీబీ ప్రశ్నించారు. చెల్లించిన బకాయిలు పోగా ఇంకా ఎంత మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి విద్యుత్ బకాయిలు పెండింగులో ఉన్నాయో వివరాలు తెలపాలని ఆ లేఖలో వైవీబీ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.