మీరు కూడా రాజకీయాలు చేస్తే ఎలా.. రమణ దీక్షితులు కు టిటిడి చైర్మన్ కౌంటర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో 15 మంది అర్చకులకు కరోనా సోకినట్లు తిరుమల గౌరవ అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరో 25 మంది రిపోర్ట్ రావలసి ఉందని ఆ ట్వీట్ లో ఆయన తెలిపారు. ఈ పరిస్థితులలో భక్తుల దర్శనాలను కొనసాగించడం వల్ల తీరని నష్టం జరిగే అవకాశం ఉందని తాను చెపుతున్నా ఇవో, ఎఇఓ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తన ట్వీట్ ద్వారా అయన ఆందోళన వ్యక్తం చేసారు. ఆ ఇద్దరు అధికారులు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలనే పాటిస్తున్నారని విమర్శించారు.

రమణదీక్షితులు ట్విట్టర్ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. టీటీడీ విషయంలో రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదని వైవీ అన్నారు. సీఎం జగన్ రమణ దీక్షితులుని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని ఈ సందర్బంగా అయన గుర్తు చేశారు. అర్చకుల భద్రత విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. టీటీడీకి ఆయన ఆగమ సలహాదారుడు కూడా అయిన రమణదీక్షితులుని పిలిచి మాట్లాడమని అధికారులతో చెప్పానని అయన తెలిపారు. ఇక ముందు ఆయన ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే గౌరవ టీటీడీ బోర్డుకు ఇవ్వాలని, మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.