అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్

 

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్‌ సింగ్‌ ఈ విషయాన్ని ప్రకటించాడు. 

ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ "వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పింది. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం ఎంతో బాధగా వుంది.  ఇన్ని రోజులుగా నన్ను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు, నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. కష్ట కాలంలో నా వెంట ఉన్న కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను" అని యువరాజ్‌ పేర్కొన్నాడు.

ధోనీ సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలో యువరాజ్‌ ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆల్‌రౌండర్‌ షోతో "మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌" అందుకున్నాడు. అనంతరం క్యాన్సర్‌ బారిన పడి అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. చికిత్స అనంతరం యువీ కెరీర్‌ అంతగా సాగలేదు. 

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌లు ఆడి 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 1177 పరుగులు చేశాడు, 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

యువ‌రాజ్‌తో క‌లిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడిన డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్. యువీ రిటైర్మెంట్ గురించి ట్విట‌ర్ ద్వారా స్పందించాడు.

Players will come and go,but players like @YUVSTRONG12 are very rare to find. Gone through many difficult times but thrashed disease,thrashed bowlers & won hearts. Inspired so many people with his fight & will-power. Wish you the best in life,Yuvi #YuvrajSingh. Best wishes always pic.twitter.com/sUNAoTyNa8

— Virender Sehwag (@virendersehwag) June 10, 2019