ట్రాఫిక్ సీఐను తోసి, కాలితో తన్నిన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు !

 

జగ్గయ్య పేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కుమారుడు సామినేని ప్రసాద్ మాదాపూర్‌లో వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌ రెడ్డి మీద దురుసుగా ప్రవర్తించడమే కాక కాలితో తన్ని దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో ప్రసాద్‌ ని పోలీసులు దుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ కృష్ణ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలో హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలను ఉల్లంఘించి ముందుకు వెళుతుండగా కృష్ణ అడ్డుకుని వారించాడు. ఆ వాహనంలో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు సామినేని ప్రసాద్ బయటకు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే కానిస్టేబుల్ ఏమన్నాడో తెలియదు కానీ నన్ను నువ్వు అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్‌ను నోటికొచ్చినట్టు తిట్టాడు. 

ఇంతలో ఈ వ్యవహారాన్ని గమనించి ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేశాడు. అయినా సరే వినిపించుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా సామినేని ప్రసాద్‌ను సీఐ రాజగోపాల్ కోరారు. దీంతో పూనకం వచ్చిన వారిలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు నన్నే సేష్టన్‌కు రమ్మంటావా అంటూ ట్రాఫిక్ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్ని మరీ తిట్లపురాణం అందుకున్నాడు. 

దీంతో ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడి చేరుకొని అతడిని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా జగ్గయ్య పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీ చేసి గెలిచారు. అయితే రిజల్ట్స్ కూడా రాక ముందే ఎండా కాలంలో మినరల్ వాటర్ పంపిణీని చేసేందుకు చలివేంద్రాల్లాంటివి ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పెట్టుకున్న ఫ్లెక్సీల్లో ఇచ్చుకున్న హోదా కాబోయే మంత్రివర్యులు సామినేని ఉదయభాను అని. అయితే సమీకారణాల దృష్ట్యా ఆయనకు పదవి దక్కలేదనుకోండి అది వేరే విషయం.