డీజీపీ ఫోటోలతో అక్రమ వసూళ్లు! సొంత పార్టీ నేతలపై ఎస్పీకి ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు..
Published on: Fri Dec 31, 2021 4:27PM
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నుంచి సెగ తగులుతోంది. తన వ్యతిరేకులతో అమీతుమీకి దిగింది రోజా. వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది. వాళ్లపై చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. అక్రమ వసూళ్లపై పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలోని కొందరు నేతలు మంత్రులు, డీజీపీతో ఫొటోలు దిగి వాటిని తప్పుడు పద్ధతుల్లో వినియోగించుకుంటున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ల ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోవర్టుల అంశాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రోజా వెల్లడించారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో జతకలిసిన వారిని క్షమించేది లేదంటూ రోజా స్పష్టం చేశారు.
నగరి నియోజకవర్గ వైసీపీలో చాలా కాలంగా విభేదాలు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకరిద్దరు నేతలు రోజాను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని సొంత పార్టీ పెద్దల అండదండలుండటంతో ఎమ్మెల్యేపై వారు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గం తయారైంది. అంతేకాదు వారు బలపడటానికి పావులు కదుపుతూ రోజాపై విమర్శలు చేస్తున్నారు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగారు. తనపై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందుకు డీజీపీ, మంత్రుల ఫోటోను వాడుకుంటున్నారని ఎస్పీకి కంప్లైంట్ చేశారు.


