TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాధాను విజయవాడకే పరిమితం చేయడం వెనుక జగన్ ప్లానేంటి..?

Published on: Wed May 18, 2016 12:34PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను ఆ బాధ్యతల నుంచి తప్పించి విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడెక్కడ..నగర పార్టీ అధ్యక్షుడెక్కడ. రాధా ప్రాధాన్యతను తగ్గించడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? అని వైసీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. కాని ఇక్కడే ఉంది జగన్ మాయ. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌భై చెబుతున్న తరుణంలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకోవాలని జగన్ యోచిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయాలకు రాజధాని, పవర్ సెంటరైన విజయవాడ నుంచి దానిని మొదలుపెట్టాలని ఆయన అనుకొంటున్నారు.

 

దివంగత ఎమ్మెల్యే, కాపు ఉద్యమనేత స్వర్గీయ వంగవీటి మోహనరంగా కుమారుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాధ 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు బెజవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో మాస్ ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో రాధ టీడీపీలోకి వెళుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు రాధ ప్రత్యర్థి దేవినేని నెహ్రూ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడను శాసించే ఇద్దరు వ్యక్తులు, రెండు సామాజిక వర్గాలు తెలుగుదేశం వశమవుతాయి. ఇదే జరిగితే విజయవాడలో టీడీపీకి ఎదురుండదు. దీనిని పసిగట్టిన జగన్ ఆ ప్రమాదం జరక్కుండా రాధాను కాపాడుకోవడానికే ఉన్నపళంగా ఆయనకు విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించారు. దానితో పాటు ఫుల్ పవర్స్‌ ఇచ్చి పార్టీని పటిష్టపరచాలని రాధాకు సూచించినట్టు సమాచారం.