తుఫాను వచ్చినా మడమ తిప్పేది లేదుట

 

రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఈనెల 26న హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ సభ తేదీలో మళ్ళీ ఎటువంటి మార్పు ఉండబోదని, 26న యధావిధిగా జరుగుతుందని పార్టీ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేసారు.

 

అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సభ మళ్ళీ మరో మారు వాయిదా వేసుకొంటే, ఏదో ఒక సాకు చూపి మడమ తిప్పేశారని మళ్ళీ వాళ్ళే విమర్శలు చేస్తారు గనుక ఇక ప్రళయమే వచ్చినా కూడా సభ విషయంలో మడమ తిప్పే ప్రసక్తే లేదని వైకాపా డిసైడ్ అయిపోయింది.

 

అయితే సభ మొదలయ్యే నాటికి వానలు తగ్గిపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. తగ్గినా తగ్గకపోయినా ఇక మడమ తిప్పే ప్రసక్తి లేదు గనుక సభకి సరిపోయే జనాలను పోగేయక తప్పదు. ఇజ్జత్ కి సవాలాయే!ఇక కోర్టు వారు అనుమతిస్తే వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలను ఈ నెల 27, 28 తేదీల్లో ఓసారి పరామర్శించి రావాలని జగన్ కోరిక. అనుమతి రాకపోతే విజయమ్మ బయలుదేరవచ్చును.