మళ్ళీ టీ-దుఖాణం తెరిస్తే జనాలొస్తారంటారా మాష్టారు

 

తెలంగాణా సెంటిమెంటుని గౌరవించడం పూర్తయిన తరువాత, వైకాపా ఓ వారం పది రోజుల పాటు సమన్యాయం కోసం నడుం బిగించింది. కానీ సమన్యాయం కంటే సమైక్యమే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని భావించడంతో సమైక్యశంఖారావం పూరించేసి మూడు దీక్షలు, ఆరు ధర్నాలతో సీమాంధ్ర ప్రాంతాన్ని హోరెత్తించేసింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సైంధవుడిలా మాటి మాటికి అడ్డుతగులుతూ వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా చేయడంతో, జీవితాన్నే మార్చేసే మరో కొత్త ఐడియా కోసం ఆలోచించక తప్పలేదు.

 

అప్పుడు సమైక్యమంటే సమైక్యం కాదనే ఒక సరికొత్త ఐడియా కనిపెట్టి దానికి ఈవిధంగా డెఫినిషన్ ఇచ్చారు. సమైక్యమంటే తెలుగు ప్రజలందరి కష్టాలు తీర్చడం కోసం చేసే పోరాటమని, కనుక అందులో తెలంగాణా ప్రజల కష్టాలు, సమస్యలు కూడా ఇమిడే ఉన్నాయని వివరించిన తరువాత, కావాలంటే తెలంగాణా కోసం కూడా ఉచితంగా పోరాడిపెడతామని తెలంగాణా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఒక బంపర్ ప్రకటించారు. అంటే సమైఖ్యం నుండి బ్యాక్ టు సమన్యాయం అన్నమాట!

 

ఇక ఎలాగు సమన్యాయానికి రిటర్నయిపోయిన తరువాత, అదే పాలసీతో తెలుగుదేశం పార్టీ నేటికీ తెలంగాణాలో నిలబడి ఉంటే, మనం మాత్రమే దుఖాణం ఎందుకు బంద్ చేసుకోవాలి? అనే ధర్మసందేహం కలగడంతో ఈ నెల 26న హైదరాబాదులో ఆయన పెట్టబోయే సమైక్యసభకు తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకు కూడా 'ద్వారములు తెరిచియేయున్నవి' అని ప్రకటించేసారు.

 

అంతే కాకుండా మెహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి వైకాపా బాధిత నేతలతో హైదరాబాదు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యేరు కూడా. సభను విజయవంతం చేయవలసిన బాధ్యతలు కూడా వారికే ఉదారంగా అప్పగించేశారు. పనిలోపనిగా మళ్ళీ తెలంగాణాలోదుఖాణం తెరిచేందుకు గట్టిగా ప్రయత్నించమని కూడా వారికి నచ్చజెప్పారు. ఎందుకంటే తీవ్ర నీటి సమస్యలతో బాధపడుతున్న అక్కడి ప్రజలను ఆదుకోవాలని ఆయన మనసు చాల తహతహలాడుతున్నపటికీ, వారు కూడా ఆయనకు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తే తప్ప, వారి సమస్యలను పరిష్కరించలేని అసహాయత వెలిబుచ్చారు.

 

విస్వసనీయతకు మారుపేరయిన ఆయనను, ఆయన పార్టీకి మళ్ళీ తెలంగాణా ప్రజలు బాజా బజంత్రీలతో ఎదురేగి స్వాగతం చెపుతారో లేదో చూడాల్సి ఉంది. పాపం కొండా సురేఖే ఇన్ని ట్విస్టులు ఉంటాయని గ్రహించలేక తొందరపడిపోయి పార్టీలోంచి కాంగ్రెస్ లోకి జంపయిపోయింది. అయినా మరేమీ పరువలేదని లగడపాటి వంటి వారు హామీ ఇస్తున్నారు కదా.