వైకాపా సమైక్య రాజకీయాలు

 

తెలంగాణా వదులుకొని వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్యాంద్ర ఉద్యమాలు సీమాంద్రాలో రాజకీయంగా పూర్తి పట్టు సాధించేందుకేనన్నది బహిరంగ రహస్యమే. అసలు రాష్ట్రం రెండుగా విడిపోతుందని ఆ పార్టీ బలంగా నమ్మినందునే తను బలహీనంగా ఉన్నతెలంగాణాను వదులుకొని, బలంగా ఉన్న సీమాంధ్రకి వచ్చేసింది. ఒకవేళ వైకాపా నిజంగానే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఉంటుందని లేదా తన ఉద్యమాల ద్వారా విభజన ప్రక్రియను ఆపగాలననే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండి ఉంటే తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనేదికాదు. కానీ వదులుకొని వచ్చిందంటే రాష్ట్ర విభజన అనివార్యమని ఆ పార్టీ మనస్పూర్తిగా నమ్ముతున్నట్లు అర్ధం అవుతోంది. అయినా కూడా నేటికీ ఆపార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం ఆపలేదు. అంటే విభజన ఖాయమని నమ్ముతూనే ప్రజలతో గొంతు కలిపి సమైక్య రాగం ఆలపిస్తూ వారి మనసులు గెలుచుకొని రానున్న ఎన్నికలలో దానిని ఓట్ల రూపంలోకి మార్చుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.

 

షర్మిల, విజయమ్మలతో సహా ఆ పార్టీలో నేతలందరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక ధ్యేయమని చాలా విస్పష్టంగానే చెపుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైకాపా నిజంగా కోరుకొంటున్నట్లయితే, తెలంగాణాలో పార్టీని మూసుకొని వచ్చేదే కాదు. కానీ ఆ పార్టీ కూడా తము అధికారంలోకి రావాలంటే విభజన అనివార్యమని నమ్ముతున్నదునే తెలంగాణాను వదులుకొని సీమాంధ్రలో సమైక్య రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది.

 

ఈ సంగతి ఏపీఎన్జీవోలు కూడా గ్రహించకపోలేదు. అదే విషయం వారు తమ సభలలో తెలియజేసి రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వైకాపా తన సమైక్య ఉద్యమాల నుండి వెనకడుగు వేయలేదు. ఈరోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే, ఇంతకాలం తన తల్లి, చెల్లి నడిపిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను చేతిలోకి తీసుకొని తన దయిన శైలిలో దూసుకుపోవడం ఖాయం.