వైకాపా రాజకీయ దుర్నీతి

 

కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత అందరికంటే ముందు వైకాపా చాలా చురుకుగా పావులు కదిపింది. తెలంగాణాలో నిలద్రొక్కుకోలేకపోయిన వైకాపా రాష్ట్ర విభజన ఖాయమని గ్రహించగానే, వెంటనే సమైక్యవాదం అందుకొని రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. తద్వారా తన శత్రువులయిన తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు సంకట పరిస్థితి కల్పించడమే కాకుండా సమైక్య చాంపియన్ గా నిలిచి సీమాంధ్రలో గట్టిగా నిలద్రొక్కుకోవాలని భావించింది. ఆ ప్రయత్నంలో వైకాపా చాల వరకు సఫలం అయినట్లే ఉంది. ఆపార్టీ ఊహించినట్లే తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కూడా సమైక్య ఉద్యమంలోకి రాక తప్పలేదు.

 

వైకాపా ఎటూ తెలంగాణాను వదులుకోవడానికి సిద్దపడింది గనుక బలంగా సమైక్యవాదంతో ముందుకు సాగడానికి ఇబ్బందిలేదు. కానీ, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాత్రం రెండు ప్రాంతాలలో తమ పార్టీలను కొనసాగించాలని భావిస్తున్నందున వాటికి ఇది చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి కల్పించింది.

 

ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విజయమ్మలతో సహా అందరూ కూడా సమైక్యాంధ్ర కోసమంటూ వ్యూహాత్మకంగా రాజీనామాలు చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజినామా కోసం పట్టుబట్టడం చూస్తే, ఎలాగయినా తెదేపాను, ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇటు సీమాంధ్రలో లేదా అటు తెలంగాణా ప్రజల ముందు దోషిగా నిలబెట్టి తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఒకవేళ చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినట్లయితే తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. రాజీనామా చేయకపోతే సమైక్యాంధ్ర వ్యతిరేఖనే ముద్ర వేయవచ్చునని వైకాపా ఆలోచన. ఇదెలాగుందంటే, ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే తనది ఒక కన్ను పోయినా పరువలేదన్నట్లుంది.

 

సీమాంధ్ర ప్రాంతంలో పట్టు సాధించేందుకు తెలంగాణాను వదులుకొన్నవైకాపా, తన ప్రత్యర్డులు రెండు ప్రాంతాలలో నాశనమయిపోవాలని శాపాలు పెడుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే హరికృష్ణను కూడా ఇప్పుడు చంద్రబాబుపైకి ఉసిగొల్పుతున్నట్లు సమాచారం. వైకాపా ప్రేరణతోనే ఆయన సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసారని, త్వరలోనే వైకాపా తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందని సమాచారం.

 

విస్వసనీయతకు మారుపేరని గొప్పలుపోయే వైకాపా ఆది నుండి ఈవిధమయిన అనైతిక ఆలోచనలోతోనే ముందుకు సాగుతోంది. దానికి ఆ పార్టీ రాజకీయ వ్యుహాలని ముద్దు పేరు పెట్టుకొన్నపటికీ అటువంటి విధానాలతో ప్రజల మెప్పు పొందడం, పార్టీని ఎంతోకాలం నెట్టుకురావడం కష్టమని గ్రహించడం మేలు.