వైకాపాలో సామాజిక 'అ'న్యాయం..!!

 

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుందని చాలామంది నాయకులు విశ్వసించారు. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి బీసీలు ఇతర సామాజిక వర్గాల నాయకులు తోసుకుంటూ వలస వెళ్లారు. కానీ.. ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసినా ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత! జగన్ సొంత జిల్లాలో తాజాగా ముగిసిన సహకార సంఘాల అధ్యక్ష పదవుల ఎంపిక వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విధమైన అనుమానాలు, సందేహాలకు బలం చేకూరుతోంది.

 

కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా... వివిధ కారణాల వల్ల కడప జిల్లాలోని 20 ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 16 సొసైటీల్లో వైకాపా, 4 సొసైటీల్లో కాంగ్రెస్ వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే... వైకాపా తరపున 16 సొసైటీల్లో ఎన్నికైన అధ్యక్షులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం.



కడపలో 16 సొసైటీల్లో ఆధిపత్యాన్ని సాధించిన వైకాపా.. ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఇతర సామాజిక వర్గాలవారిపై చిన్నచూపు చూడడంతో..త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని అమలు చేస్తారన్న అభిప్రాయలు బలపడుతున్నాయి. దీంతో వైకాపాలో అంటే ఒక సామాజిక వర్గం పార్టీగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఈ పరిణామం కనిపిస్తోంది.