TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ విగ్ర‌హాల ధ్వంసం.. వైసీపీలో ఆందోళ‌న‌...

Published on: Sat Jan 15, 2022 11:12AM

ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో.. రెండు ఘ‌ట‌న‌లు కాక‌తాళీయంగా జ‌రిగాయి. ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేకుండా.. ఆ రెండూ ఒకేరోజు జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌పై ధ్వేసంతోనో ఏమో.. కార‌ణం తెలీదు కానీ ఏపీలోని చిత్తూరు జిల్లా, తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాల్లోని వైఎస్సార్ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. ఆ రెండు ఘ‌ట‌న‌లతో ఇటు వైఎస్సార్‌సీపీ, అటు వైఎస్సార్‌టీపీ పార్టీలు ఉలిక్కిప‌డ్డాయి. అది వైఎస్సార్‌పై వ్య‌తిరేక‌తా? జ‌గ‌న్‌, ష‌ర్మిల‌పై ఆగ్ర‌హ‌మా తెలీక ఆందోళ‌న చెందుతోంది.

చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్‌పురం మండల కార్యాలయం ద‌గ్గ‌ర‌ ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు పుత్తూరు రోడ్డుపై వైసీపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. 

ఇక‌, తెలంగాణలోని సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఘటనపై వైఎస్సార్‌టీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తగులబెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు.