రైతు భరోసా సగానికి సగం కోత... అన్నదాతలకు జగన్ సర్కారు షాక్..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలను చూస్తుంటే... కోటలు దాటుతున్నాయ్. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటపెడుతున్నారు. అమ్మఒడి పథకం నుంచి రైతుభరోసా పథకం వరకు అన్నింటా ఇదే జరుగుతోంది. వైసీపీ నవరత్నాల్లో భాగంగా ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... లబ్దిదారులను సగానికి సగం తగ్గించేందుకు వడపోత ప్రారంభించారు. అక్టోబర్ నుంచే వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేస్తామని గొప్పగా ప్రకటించిన జగన్... మార్గదర్శకాల పేరుతో అన్నదాతలకు ఊహించని షాకిచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో సర్కారు ప్రకటించిన లబ్దిదారుల సంఖ్య... సగానికి సగం తగ్గిపోయింది. కౌలు రైతులతో కలుపుకొని 64లక్షల పైగా(రైతులు 48.7లక్షలు, కౌలు రైతులు 15.37లక్షలు) సాగుదారులు ఉన్నారని, వారందరికీ పెట్టుబడి సాయం అందిస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్న జగన్ సర్కారు... గైడ్ లైన్స్ అండ్ వడపోత తర్వాత ఆ సంఖ్యను దాదాపు 36లక్షలకు కుదించేసింది.

ఎన్నికల టైమ్ లో ప్రతి రైతుకూ 12వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.... ఇఫ్పుడు కేంద్రం ఇస్తోన్న 6వేలు పోను... మిగతా 6500లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, కేంద్రం అమలు చేస్తోన్న గైడ్ లైన్స్ నే జగన్ సర్కారు కూడా ఫాలో కావాలని నిర్ణయించింది. కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం లబ్దిదారుల సంఖ్య  29.45లక్షలకు పడిపోయింది. ఎన్నికలవేళ కేంద్రం మొదటగా ఏపీలో దాదాపు 43లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ మనీ జమచేయగా, రెండో విడతకు వచ్చేసరికి పలురకాల కండీషన్స్ తో లబ్దిదారుల సంఖ్యను 33లక్షలకు తగ్గించేసింది. ఇక మూడో విడత వచ్చేసరికి ఆ సంఖ్య 29.45లక్షలకు పడిపోయింది. కేవలం మూడే మూడు నెలల్లో గైడ్ లైన్స్ పేరుతో ఏకంగా పదమూడున్నర లక్షల మంది రైతులను అర్హుల జాబితాలో నుంచి తొలగించేసింది. అయితే, కేంద్రం ఇస్తోన్న సొమ్ముతో కలిపే 12వేల 500 ఇస్తామంటూ మెలిక పెట్టిన జగన్ సర్కారు... అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ, లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టింది. కేంద్రం ఎవరి ఖాతాల్లో అయితే, మూడు విడతల్లో 6వేల రూపాయలు జమ చేసిందో... వాళ్లకే మిగతా ఆరున్నర వేలు వేయనున్నట్లు తెలుస్తోంది.

సొంత భూమి కలిగిన రైతుల విషయంలో గైడ్ లైన్స్ ఇలాగుంటే, ఇక కౌలు రైతుల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకపోవడంతో, మొత్తం 12వేల 500 తామే ఇస్తామంటోంది జగన్ సర్కారు. అయితే, గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో కౌలు రైతుల సంఖ్యను కూడా 16లక్షల నుంచి ఐదారు లక్షలకు తగ్గించి, పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం గైడ్ లైన్స్ అండ్ కండీషన్స్ పేరుతో వైఎస్సార్ రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం కోత పెట్టిన జగన్ సర్కారు... కేవలం 30లక్షల్లోపు రైతులకే సాయం అందించినున్నట్లు తెలుస్తోంది.