వైఎస్సార్ ఫొటో ఫేడవుట్ అవుతోందా?
Published on: Fri Feb 4, 2022 1:43PM
చీమా చీమా ఏం కావాలి నీకు అంటే.. పిసరంత పవర్ కావాలి దేవుడా అని కోరుకుందట. చిరుప్రాణులైన చీమలకే పవర్ మీద అంత మోజున్నప్పుడు.. ఆరడుగుల మనుషులకు మాత్రం ఎందుకుండదు? అయితే పవర్ ఉపయోగించి మనుషుల్ని కుట్టిన చీమలు.. వాటి జీవితంలో బాగుపడినట్టు చరిత్రలో లేదు. కుట్టినచోటే కుక్కిన పేనుల్లా చచ్చూరుకుంటాయి కాబట్టి. ఎందుకంటే అవి కుట్టిన వెంటనే మనుషుల్లోని మెదడు 'అసంకల్పిత ప్రతీకార చర్య 'కు ఉపక్రమించి... ఆ చీమలు కుట్టిన చోట చేత్తో ఒక్క దెబ్బ వేసేలా చేసి నలిపేస్తుంది.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. పవర్ ను దుర్వినియోగం చేస్తే చీమలైనా, పాములైనా నేల కరవక తప్పదు. ఇది శాశ్వతమైన ప్రాపంచిక సత్యం. అయితే అలాంటి పవర్ కోసం ఏపీ సీఎం జగన్... తాను సీఎం కాకముందు ఎన్ని కలలు కన్నారో, ఎందరిని ఆశ్రయించారో, ఎందరి సలహాలు తీసుకున్నారో తెలుగు ప్రజలకు తెలియంది కాదు. ఆ పవర్ కోసమే తండ్రిగారైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ఇప్పటికీ సాక్షి చానల్ మీద లోగోలో సైతం మిక్స్, పుష్పాభిషేకం చేయిస్తూ తన ప్రేమను ప్రపంచానికి చాటుకుంటున్నారు. తండ్రి సంపాదించిన మహానేత అనే పేరు ప్రఖ్యాతులు తన రాజకీయ భవితవ్యానికి ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు, ఆ మహానేత వారసుణ్ని అని ప్రజల్ని నమ్మించేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. 2009లో వైఎస్ చనిపోయిన వెంటనే ఆయన ఫొటోలు, ఆయన పథకాలు, ప్రజలతో మమేకమైన ఆయన సర్వస్వాన్నీ తనకు సంక్రమింపజేసుకున్నారు.. జగన్. వైఎస్సార్సీపీ అంటూ తండ్రి పేరుతోనే పార్టీని కూడా స్థాపించుకున్నారు. ప్రజల ముంగిట నిలబడ్డారు. పాదయాత్రలు చేశారు. రైతుదీక్షలు చేశారు. ఓదార్పు యాత్రలు చేశారు. కాసింత పవర్ కావాలంటూ ప్రార్థించారు. ప్రాధేయపడ్డారు. తలలు నిమిరారు. అమ్మలు, అక్కలు, తల్లుల కడుపుల్లో తల పెట్టి, చేతులు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని ఓట్లడిగారు. ఆఖరుకి సక్సెస్సయ్యారు. తనక్కావాల్సిన పవర్ ను సాధించుకున్నారు.

అయితే పవర్ కోసం ఇన్ని సర్కస్ ఫీట్లు చేసిన జగన్, తను సాధించుకున్న పవర్ లో ఇతరుల పాత్ర, ముఖ్యంగా జన్మనిచ్చిన తండ్రి పాత్ర కూడా లేకుండా చేసుకోవాలన్న ఆరాటం కలిగినట్లుంది అంటున్నారు ఏపీ రాజకీయ పరిశీలకులు. తొలుత పార్టీ లోగోలో వైఎస్ బొమ్మ మాత్రమే ఉండేది. అయితే పార్టీ లోగో నుంచి నిదానంగా తండ్రి ఫొటో లేకుండా చేయాలనిపించిందో ఏమో తెలీదు కానీ... కొంతకాలం తర్వాత ఆ లోగో మధ్యలో, ప్రభుత్వ పథకాల్లో తండ్రి ఫొటో పక్కన జగన్ బాబు ఫొటో వచ్చి చేరిపోతోంది. కొన్ని సందర్భాల్లో అయితే వైఎస్సార్ బొమ్మ అదృశ్యమైపోయి కేవలం జగన్ ఫొటో మాత్రమే దర్శనమిస్తోంది. పార్టీ సింబల్ గా పాతదే ఉన్నా.. జనంలో మాత్రం ఇప్పుడు జగన్ సింగిల్ ఫొటో ఉన్న లోగో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ లో ఈ వైఖరి ఎందుకొచ్చిందో సులభంగానే అర్థం చేసుకోవచ్చని ఏపీ ప్రజానీకం, రాజకీయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కలలు కంటున్న జగన్... ఇకపై తండ్రి ఫొటోను ప్రజల మస్తిష్కాల్లోంచి ఫేడవుట్ చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. పవర్ సంపాదించుకున్నాక అసలా పవర్ జనరేటర్ నే మూలకు పడేయడం ప్రజల్లో నెగెటివిటీకి కారణమవుతుందని, ఇప్పటికే ప్రజాశ్రేణుల్లో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్... తన సొంత ఇమేజ్ ని సైతం కోల్పోయే తొందరపాటు చర్యలకు దిగుతున్నాడని, అది తనకే నష్టం కలిగిస్తుందనీ అంటున్నారు. మరి జగన్ కు ఏపీలో ఎలాగూ పవర్ వచ్చింది కాబట్టి.. ఏపీలో వైఎస్సార్ బొమ్మ తీసేసి... ఇటు తెలంగాణలో చెల్లెలి పార్టీ (తెలంగాణ వైసీపీ) కి వైఎస్సార్ బొమ్మ పెట్టుకునే అవగాహన ఏమైనా కుదుర్చుకున్నారా అంటూ అనుమానిస్తున్నారు తెలుగు ప్రజలు. మరి ఇలా ఈ పవర్ కోసం పాకులాటలు... ఏపీలో ఎటు దారి తీస్తోయో, తెలంగాణలో ఎటువైపు మళ్లుతాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ నిపుణులు. సో.. దాని మీద క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనేమో.


