జనం మధ్య జగన్ ... పోలీస్ రక్షణలో సిబీఐ అధికారులు
Published on: Tue Apr 10, 2012 3:57PM
వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు సిబీఐ దాఖలు చేసిన కేసులో జగన్ ను ఎ1 ముద్దాయిగా పేర్కొంది. అయినప్పటికీ అరెస్టు చేయడంలో తాత్సారం చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల రూపాయలలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఛార్జి షీట్ లలో రెండవ ముద్దాయిగా వున్న విజయసాయి రెడ్డికి, అరెస్టు అయిన సీనియర్ ఐఎఎస్ అధికారులకు బెయిల్ మంజూరు కాకుండా చేస్తున్న సిబీఐ అధికారులు మొదటి ముద్దాయిగా వున్న జగన్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభించడంపట్ల దాని విశ్వసనీయతపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న చిన్న చీటింగ్ కేసులకే ముద్దాయిలను అరెస్టు చేసే పోలీసులు వేల కోట్ల రూపాయలకు సంబంచించి అనేక ఆధారాలతో ఛార్జి షీటు దాఖలు చేసి కూడా అరెస్టు చేయకపోవడం చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతోందనే భావన కలుగుతోంది., ఎన్ని కబుర్లు చెప్పినా రాజకీయ నాయకులందరూ ఒకటేననే భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. తాజాగా లెటరోగేటరీ పేరుతొ విదేశాలలో ఆధారాలు సంపాదించడం కోసం సిబీఐ అధికారులు వెళ్ళడం చూస్తుంటే జగన్ ను అరెస్టు చేసే ఉద్దేశ్యం వున్నట్టు కనిపించడం లేదని ప్రజలు చెప్పుకొంటున్నారు. అయితే ఇదే సమయంలో సిబీఐ కేసును అంత తేలికగా తీసివేయడానికి వీలులేదని, చర్య తీసుకోవడం జాప్యం కావచ్చునేమోకాని ఎవరినీ వదలడాని, గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్, సుఖ్ రామ్, కనిమొళి, దయానిధి మారన్ వంటి అగ్రనేతలను కూడా వదలలేదని ... జగన్ ను వదిలివేస్తారనుకోవడం అయాకత్వం అవుతుందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎ - 1 ముద్దాయిగా ముద్రవేసుకున్న జగన్ దర్జాగా జనం మధ్యలో తిరుగుతుంటే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన సిబీఐ అధికారులు సాయుధ పోలీసుల రక్షణలో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాము ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి జగన్ కేసును దర్యాప్తు చేస్తున్నామని సిబీఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట చెబుతున్నారు. అయితే మీరు మరీ అంతటి త్యాగాలు చేయనక్కరలేదని ప్రాణాలు త్యాగాలు చేసేకన్నా ఉద్యోగాలు మానుకుంటే మంచిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడంతో సిబీఐ సిబ్బంది వెర్రిచూపులు చూడాల్సివచ్చింది.


