కొండా సురేఖకు కాలం కలిసొస్తుందా?
Published on: Wed May 2, 2012 10:07AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ పరకాల ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారా అన్న విషయం ఇంకా తేలలేదు. పరకాలలో తెలంగాణావాదం బలంగా ఉన్న నేపథ్యంలో ఆమె గెలుపు కష్టమని అందుకే పార్టే తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఆమె చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకొని విధంగా ఇప్పుడు ఆమెకు పరిస్థితులు మెరుగుపడ్డాయి.
తెలంగాణావాద రాజకీయ పార్టీల మధ్య చీలిక రావటంతో కొండా సురేఖ సంతోషంగా ఉన్నారు. ఈ చీలికలను ఆసరాగా చేసుకుని పార్టీ తరపునే ఆమె పోటీ చేయాలను కుంటున్నట్లు తెలుస్తోంది. పరకాల ఎన్నికలలో తెలంగాణా టిడిపి ఇప్పటికే తమ అభ్యర్థి పేరును ప్రకటించింది. బిజెపి, టి.ఆర్.ఎస్. కూడా త్వరలోనే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణావాద పార్టీలన్నీ విభేదాలు విస్మరించి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఆందోళన చేస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టకపొతే తెలంగాణా పొలిటికల్ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండ రామ్ ఆశీస్సులతో ఎవరో ఒక విద్యార్థి నాయకుడు పరకాలాలో పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణా సెంటిమెంటు ఉన్న పరకాల ఓటర్లలో చీలికరావడం ఖాయం. తెలంగాణావాడ ఓట్లలో చీలిక వస్తే తన విజయం తేలిక అవుతుందని కొండా సురేఖ అంచనా వేస్తున్నారు


