TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సందిగ్థంలో కొండా సురేఖ ...!

Published on: Wed Apr 11, 2012 10:42AM

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకురాలు, పరకాల నియోజకవర్గ శాసనసభ్యురాలు (తాజామాజీ) కొండా సురేఖ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్థంలో వున్నట్టు తెలుస్తోంది. వై ఎస్ ఆర్ కు వీర అభిమాని అయిన సురేఖ, వై ఎస్ ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీలో కీలక నాయకురాలిగా మారారు. అనర్హత వేటు కారణంగా సురేఖ కూడా శాసన సభ్యత్వం కోల్పోవడంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పరకాల కూడా వుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఇతర శాసన సభ్యులకంటే ఈమె పరిస్థితి భిన్నంగా వుంది. 18 నియోజకవర్గాలలో 17 కోస్తాంధ్రలో వుండగా ఈమెకు చెందిన వరంగల్ జిల్లాలోని పరకాల మాత్రమే తెలంగాణలో వుంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం వల్ల తెలంగాణ ప్రాతంవారు జగన్ ను సమైక్యవాదిగానే భావిస్తారు. దాంతో ఉప ఎన్నికల్లో వై ఎస్ ఆర్ పార్టీ తరపున పోటీలో నిలిస్తే తన పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ లో నాగం జనార్థనరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్టు తాను కూడా స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేస్తే ఎలా వుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ లో నాగంకు టి.ఆర్.ఎస్ మద్దతు ప్రకటించింది. నాగం కూడా తెలంగాణ కోసమే పదవిని వదులుకున్నారు. దాంతో స్థానికులు నాగంను తెలంగాణ వాడిగా గెలిపించుకున్నారు.

పరకాలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. సురేఖ ప్రత్యేక తెలంగాణ కోసం పదవి త్యాగం చేయలేడు. కేవలం జగన్ కోసం పదవి త్యాగం చేశారనే భావన ప్రజలలో వుంది. దీనికి తోడు సురేఖకు టి.ఆర్.ఎస్. మద్దతు ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే పరకాల నుంచి పోటీ చేయడానికి టి.ఆర్.ఎస్. అభ్యర్థిని కూడా సిద్ధం చేసింది. ఈ పరిస్థితి వస్తుందనే ముందుగా ఊహించే సురేఖ తెలంగాణ ఏర్పాటు కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రజలలో గుర్తింపు పొందడానికి ప్రయత్నించినా స్పీకర్ నిర్ణయం అందుకు అనుకూలంగా లేకుండా పోయింది. ఆమెపై ప్రత్యేక తెలంగాణ కోసం కాకుండా పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేశారు. దాంతో తాను తెలంగాణ కోసం పదవి త్యాగం చేశానని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ స్థితిలో తాను వై.ఎస్,ఆర్. పార్టీ తరపున పోటీ చేయాలా? లేక స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలా అసలు పోటీ చేయకుండా టి.ఆర్.ఎస్. అభ్యర్థికి మద్దతు తెలపాలా? అనే సందిగ్థంలో సురేఖ వున్నారని తెలుస్తోంది.