సమయం కాని సమయంలో వైకాపా ధర్నాలు

 

ప్రతిపక్ష పార్టీ అన్నాక ఏదో ఒక హంగామా చేస్తూ ఉండక తప్పదు లేకుంటే ప్రజలు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేస్తారు. ‘అసలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉందా లేదా?’ అంటూ మీడియా కూడా వెనక నుండి గిల్లుతో ఉంటుంది. అదీగాక నిత్యం ఏదో ఒక హడావుడి చేయకపోతే పార్టీ నేతలు వారి అనుచరులు కూడా పక్క పార్టీల వైపు దిక్కులు చూడటం మొదలుపెడుతుంటారు. కనుక ఏదో ఒక సాకు దొరకబుచ్చుకొని ప్రతిపక్షాలు హడావుడి చేయక తప్పదు. కనుకనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాయి, ప్రభుత్వాలు, ప్రజలు ఏమనుకొన్నా సరే.

 

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కూడా ఆ సూత్రమే పాటిస్తోందని చెప్పవచ్చును. ప్రభుత్వం తన హామీలను అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, మహా ధర్నాలు నిర్వహించిన వైకాపాకు వైజాగ్ కాకుండా మరో ఒకట్రెండు జిల్లాలలో మాత్రమే స్పందన కనబడింది. వైజాగ్ లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చొన్నారు గనుక ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణ చేయడంతో అక్కడ జనాలు బాగానే కనబడ్డారు.

 

మళ్ళీ వచ్చే నెల 6, 7 తేదీలలో జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ధర్నాలు చేయబోతున్నారు. కారణం అదే. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఆ జిల్లాలో వైకాపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే ఆ జిల్లాలో పార్టీకి అంత పట్టులేదని అర్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఆ జిల్లాలో జగన్ ధర్నాకు కూర్చోన్నాక ధర్నా కార్యక్రమంలో జనాలు కనబడకపోతే చాలా అవమానకరం కనుక స్థానిక నేతలు మళ్ళీ జనసమీకరణ కోసం చెమటోడ్చక తప్పదు.

 

ఇక ధర్నా కోసం ఆయన ఎంచుకొన్న సమయం కూడా సరిగ్గాలేదని చెప్పవచ్చును. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సంక్రాంతి పండుగకు సరిగ్గా వారం రోజుల ముందు ధర్నాకు కూర్చోవడం వలన ఆశించిన ఫలితం కనబడక పోవచ్చును. అదే అసెంబ్లీ సమావేశాలకు ముందు తనకు బాగా పట్టున్న ఏ కడపలోనో నెల్లూరులోనో ధర్నాలో, మహామహా ధర్నాలో విజయవంతంగా చేసుకొని ఉంటే, ఆ పేపర్ కటింగులు పట్టుకొనొచ్చి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది. కానీ తనకు బొత్తిగా బలం లేని చోట ప్రజలందరూ పెద్ద పండగకి సిద్దమవుతున్న సమయంలో ధర్నాలు చేయడం తప్పు నిర్ణయమేనని భావించవచ్చును.