వైకాపా కేర్ ఆఫ్ లోటస్ పాండ్

 

త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని త్వరలో విజయవాడకు తరలించబోతోంది. కనుక ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నఆ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని జగన్ నివాసమయిన ‘లోటస్ పాండ్’ ప్యాలస్ లోకి తరలించబోతున్నారు. విజయవాడలో కార్యాలయం ఏర్పడేవరకూ అక్కడి నుండే తాత్కాలికంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్రానికి కూడా వేరొకచోట పార్టీ కార్యాలయం ఏర్పాటుచేయబోతున్నట్లు సమాచారం.

 

రాష్ట్ర విభజన జరిగి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు కనుక అక్కడ అన్ని పార్టీలు తమతమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం సహజమే. కనుక వైకాపా కూడా విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. కానీ తెలంగాణా రాష్ట్రంలో కూడా పార్టీని నడపాలని భావిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ దాని కోసం ‘లోటస్ పాండ్’లో కాక వేరొకచోట కార్యాలయం ఏర్పాటుచేయాలని భావిస్తున్నప్పుడు ముందుగా ఆ ఏర్పాటు చేసుకొని అక్కడికి పార్టీ కార్యాలయాన్ని తరలించి ఉండిఉంటే బాగుండేది. కానీ ముందు ఆ పనిచేయకుండా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, తాళం వేయడం తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. అసలే పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న పార్టీ తెలంగాణా నేతలకు, కార్యకర్తలకు ఇది మింగుడుపడని విషయమే. అయితే అది జగన్ కి చెప్పుకోవాలన్నా వారికి ‘లోటస్ పాండ్’ లోకి ఎంట్రీ అంత వీజీ కాదు.