తెలంగాణపైకి దూసుకు రానున్న జగనన్న బాణం

 

వైకాపా తెలంగాణా పునః ప్రవేశం ఖరారయిపోయింది. ఊహించినట్లే తెలంగాణపైకి జగనన్న బాణం షర్మిల త్వరలో రివ్వున దూసుకురాబోతోంది. ఈరోజు హైదరాబాదులో జరుగుతున్న పార్టీ తెలంగాణా నేతల విస్త్రుత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యంపీ పొంగులేటిని తెలంగాణాలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే షర్మిలే పార్టీకి సారధ్యం వహిస్తారు. అంతే కాదు తెలంగాణాలో జగన్మోహన్ రెడ్డి ఓదార్చలేకపోయిన వారినందరినీ ఆయన తరపున ఆమె ఓదారుస్తారు. వైకాపా తరపున తెరాసపై ఆమే తొలి బాణం ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెరాస కనబడకుండా పోతుందని అన్నారు.

 

సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రజల తరపున పోరాడేందుకు గుండె నిండా ఎంతో దైర్యం ఉండాలి. అప్పుడే వాడు నాయకుదనిపించు కొంటాడు. సినిమాలలో చివరి వరకు విలన్ చాలా బలంగా, గొప్పగా కనిపిస్తాడు. కానీ చివరికి హీరో చేతుల్లో చావు దెబ్బలు తింటాడు. అలాగే మన వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో ఇప్పుడు బలహీనంగా కనిపించవచ్చును. ప్రత్యర్ధ పార్టీలు చాలా బలంగా కనిపించవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో మనమే విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రజల తరపున మనం పోరాడుతున్నాము కనుక ప్రజలు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆవిషయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో రుజువయింది. ఆయన చనిపోయినప్పుడు ఆ వార్త విని తట్టుకోలేక చాలా మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. తెలంగాణాలో కూడా చాలామంది ప్రజలు మరణించారు. కానీ దురదృష్టవశాత్తు వారినందరినీ నేను ఓదార్చలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యతా షర్మిల తీసుకొంటుంది. ఆమె నా తరపున ఇంటింటికీ వెళ్లి అందరినీ ఓదార్చుతుంది."

 

“ప్రజల కోసం పోరాడేందుకు మనం ఉన్నామని గుర్తు చేయడానికి మన పార్టీ జెండా తెలంగాణా అంతటా రెపరెపలాడాలి. ప్రజలందరూ మన వెంటే ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా పనిచేసినట్లయితే వచ్చే ఎన్నికలలో మనదే విజయం. తెలంగాణాలో చివరికి కేవలం కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే మిగిలి ఉంటాయి. మిగిలిన పార్టీలన్నీ కనబడకుండా పోతాయి,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.