ఉప ఎన్నికలే జగన్ లక్ష్యం
Published on: Fri Dec 16, 2011 10:31AM
హై
దరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ఓదార్పు యాత్రలో బిజీబిజీగా ఉంటున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం లేదు.పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.పార్టీ నిర్మాణంలో భాగంగా జగన్ ఎప్పటి నుండో కార్యకర్తలతో సమావేశమవుతూ, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అందుకోసం స్థానికంగా ఉండే సమస్యలపై ఆందోళనలు చేపట్టాలని సూచనలు ఇస్తూ వస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశముండటంతో పార్టీ అనుబంధ కమిటీలను ఒక్కటొక్కటిగా ప్రకటిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజకీయ వ్యవహారాలు, క్రమశిక్షణా కమిటీని ప్రకటించారు.ఉప ఎన్నికలు మరెంతో దూరం లేనందున తన తదుపరి ఓదార్పు యాత్రను ఆయా జిల్లాల్లో నిర్వహించనున్నారని సమాచారం. తద్వారా ఓదార్పు యాత్ర కొనసాగడంతో పాటు ఎన్నికల ప్రకటన వచ్చే వరకు ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నారట. శుక్రవారంతో గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకొని ఆయన సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శనివారం సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులతో, ఆదివారం తన వర్గం ఎమ్మెల్యేలతో జగన్ భేటీ కానున్నారు.
ఉప ఎన్నికలు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. 19 తర్వాత రెండు రోజులు పార్లమెంటు సమావేశాలలో హాజరవనున్నారు. ఆ తర్వాత నెలాఖరు నుండి ఉప ఎన్నికలు జరగబోయే మరో జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారని తెలుస్తోంది.


