జగన్ తో టి-నేతల ఆవేదన
Published on: Tue Jan 3, 2012 11:53AM
హైదరా
బాద్: మంగళవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఉప ఎన్నికలు, తెలంగాణలో జగన్ ఓదార్పు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలు పలుమార్లు జగన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు.పార్టీ ఉప ఎన్నికల బరిలోకి దిగకుంటే మా భవిష్యత్తు ఏమిటని తెలంగాణ ప్రాంత నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. తెలంగాణలో పోటీ చేయాల్సిందేనని వారు విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ ఎదురు నిలబడి పోరాటం చేస్తుంటే మీరు చేసేది ఇదా అని వారు జగన్‌తో ఆవేదనగా చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయకుంటే తెలంగాణలో పార్టీ కనుమరుగు కావడం ఖాయమని వారు జగన్‌తో అన్నారు. ఉప ఎన్నికల బరి నుండి వెనక్కి వెళ్లడంపై పునరాలోచించుకోవాలని వారు కోరారు.
కాగా బుధవారం ఒంగోలులో జగన్ ఫీజు ధర్నాలో పాల్గొంటారు. అదే సమయంలో తెలంగాణలోనూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ నేతలు నిర్ణయించుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ నిజామాబాద్ నుండి ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కన్వీనర్లు, మాజీ నేతలు తదితరులు హాజరయ్యారు.


