TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన నాయకుల జాతకాలు ఇలా ఉండనున్నాయి

Published on: Fri Apr 8, 2016 10:46AM

 

నేడు తెలుగు సంవత్సరాది. ఈ రోజున అందరూ కొత్త సంవత్సరంలో తమకు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయోనని పంచాంగ శ్రవణం చేస్తారు.  మన రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఉబలాట పడుతుంటారు. ఇటువంటి వారి కోసమే ఈ రాజకీయ పంచాంగ శ్రవణం

 

చంద్రబాబు నాయుడు: తెలుగు దేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కూడా కష్టాలతో కాపురం చేయాల్సి ఉంటుంది. సీఎం మానస పుత్రిక అయిన రాజధాని అమరావతి, పోలవరంతో పాటు మరెన్నో ప్రాజెక్ట్‌లు బాబు సత్తాకు సవాల్‌గా మారనున్నాయి. మరోవైపు తెలంగాణలో పార్టీని కాపాడాల్సిన ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది. గెలిచిన 15 మందిలో 12 మంది కారెక్కెయడంతో ఉన్నవారిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వాళ్లని చేజార్చుకోకుండా చూసుకోవడం బాబుకి కత్తిమీద సామే. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్ష వైసీపీని చంద్రబాబు బాగానే కంట్రోల్ చేస్తారని చెప్పవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా జగన్‌ను దెబ్బ కొట్టడంలో తెలుగుదేశం అధినేత మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.

 

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు: దుర్ముఖి నామ సంవత్సరంలోనూ కేసీఆర్ ప్రభ వెలిగిపోనుంది. ఏ ఎలక్షన్స్ ప్రకటించినా అందులో టీఆర్ఎస్ తప్ప వేరొక పార్టీ గెలవకపోవడంతో గులాబీ దళపతి ఖుషిఖుషిగా ఉన్నారు. సమీప కాలంలో ఆయనను ఎదురించే..ఎదుర్కోనే నేత మరొకరు కనిపించకపోవడంతో సూపర్ స్టార్ డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందాలు, డబుల్ బెడ్‌రూంలు, మిషన్ భగీరథ, గ్రామజ్యోతి తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆయనపై అభిమానం మరింత పెరిగిపోయింది. ఈ ఏడాది మరిన్ని కొత్త పథకాలు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండటంతో ఈ సంవత్సరం కూడా కేసీఆర్‌కు ఎదురు ఉండదని పండితులు బల్లగుద్ది చెబుతున్నారు.

 

జగన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌కు ఈ సంవత్సరం కూడా గడ్డుకాలమే. ప్రతిపక్షనేతగా విఫలమవ్వడం, ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి చాలా మంది ఎమ్మెల్యేలు పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సంవత్సరం ఆపరేషన్ ఆకర్ష్‌కు టీడీపీ బాస్ మరింత పదనుపెట్టనున్నారు. తెలంగాణలో ఉన్న ఒకేఒక్క ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా గులాబీ లాగుతుండటంతో వారు కూడా చేజారిపోయేట్టున్నారు. ఇటు చంద్రబాబు, అంటు కేసీఆర్‌ల పక్కలో బల్లెంలా తయారవ్వడంతో ఏం చేయాలో తెలియక జగన్ జుట్టుపీక్కుంటున్నాడు.