TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కాంగ్రెస్‌లోకీ రీఎంట్రీ ఇస్తారా?

Published on: Tue Apr 5, 2016 2:51PM

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనికి హస్తమందించడానికి ఢిల్లీ రేంజ్‌లో స్కెచ్ రెడీ అయిందట. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో జగన్ పోలీటికల్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు జగన్. అయితే వైఎస్ ఆకస్మిక మరణం తదనంతర పరిణామాలతో తనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు జగన్. కానీ ఆయన అభ్యర్థనను సోనియా తిరస్కరించారు. అథిష్టానం వద్దంటున్నా వినకుండా ఓదార్పు యాత్ర చేపట్టి ఆగ్రహానికి గురయ్యారు జగన్. తనకు జరిగిన అవమానాలకి కలత చెందిన జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. తనతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిపించుకున్నారు జగన్.

 

తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకి సైతం వెళ్లారు జగన్. దీనికంతటికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని జగన్ బలంగా నమ్మారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. తెలుగు దేశంకు ప్రత్యామ్నాయంగా జగన్ వైసీపీ విజయవంతంగా ముందుకు వెళుతుండటం..కాంగ్రెస్ పార్టీలో ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని జగన్‌పై పెట్టింది. ఎలాగైనా జగన్‌ను కాంగ్రెస్‌లోకి తిరిగి చేర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రండి..అందరం కలిసి కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుందాం అనడం లేదు. జగన్ కు శాపనార్థాలు పెడుతూనే పార్టీలోకి పిలుస్తున్నారు.. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి వైసీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయం అంటూ రఘువీరా, జేడీ శీలం వంటి వారు జోస్యం చెబుతున్నారు. ఈ విధంగా మైండ్ గేమ్‌తో జగన్‌ను మానసికంగా దెబ్బతీసి తన దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ట్రై చేస్తోంది. మరి కాంగ్రెస్ ఎత్తులకు జగన్ లొంగుతారో లేక ఏపీలోని మిగిలిన హస్తం నేతల్ని ఫ్యాన్ కిందకి తీసుకువస్తారో వేచి చూడాలి.