తెరాసపై ఆ పత్రికలో కూడా విమర్శలు?

 

ఇంతవరకు తెరాస, వైకాపాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలే కొనసాగుతున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఎన్నడూ ఒకదానినొకటి విమర్శించుకోలేదు. తెరాస మంత్రులు, నేతలు ఆంద్రప్రదేశ్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నప్పటికీ వైకాపా ఎన్నడూ నోరు విప్పి వాటిని ఖండించలేదు. కానీ వైకాపా ఇప్పుడు తెలంగాణాలోకి పునః ప్రవేశించాలని భావిస్తున్నందున మెల్లగా తెరాసపై బాణాలు సంధిస్తోంది. ఆ పార్టీ అధినేతకు చెందిన పత్రికలో కొత్తగా యం.యల్యే.గా ఎన్నికయిన ఒక తెరాస నేత ఒకరు వసూళ్ళకు పాల్పడుతున్నారని, ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి తీవ్రంగామందలించారని ఒక వార్త ప్రచురించింది. సాధారణంగా ఇటువంటి వార్తలు తెరాసను వ్యతిరేఖించే పత్రికలలోనే ముందుగా ప్రచురితమవుతుంటాయి. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వం తరపున దానికి మద్దతుగా వార్తలు ప్రచురిస్తూ ఉండేవైకాపాకు చెందిన ఆ పత్రికలో తెరాస నేతలు వసూళ్ళకు పాల్పడుతున్నారనే వార్త ప్రచురింపబడటం గమనిస్తే తెరాస పట్ల వైకాపా వైఖరి మారుతున్నట్లు స్పష్టం చేస్తోంది. బహుశః తెరాస నేతలు కూడా వైకాపాపై అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తే, ఇక ఆ రెండు పార్టీల మధ్య తెగతెంపులు జరిగి, వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశానికి రంగం సిద్దమయినట్లే భావించవచ్చును.