అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్..ఫలించనున్న ఆశావహుల కలలు
Published on: Mon Jan 23, 2012 9:35AM
హైద
రాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆరేళ్ల క్రితం నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతీ గతీ లేదు. వాటి కోసం ఆశావహులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు... సీఎం కిరణ్ వీరి 'దాహం' తీర్చేందుకు సిద్ధమవుతున్నారు. 2004 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతి సంవత్సరంలో వైఎస్ నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. అప్పటికి అదే ఆఖరు. మళ్లీ 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ పదవులను భర్తీ చేస్తామని వైఎస్ గట్టిగా హామీ ఇచ్చారు. కానీ... ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ రాజకీయాలు పెను మలుపు తిరిగాయి. ప్రాంతీయ ఉద్యమాలు, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మూలన పడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య చాలా పరిమితంగా మాత్రమే పోస్టులు భర్తీ చేశారు. ఆయన ఏపీఐఐసీ చైర్మన్‌గా శివ రామ సుబ్రమణ్యాన్ని, సాంస్కృతిక విభాగం చైర్మన్‌గా రమణమూర్తిని నియమించారు. ఇతర పోస్టుల జోలికి వెళ్లలేదు. ఏపీఐఐసీ చైర్మన్ పదవీ కాలం కూడా ఇటీవలే ముగిసింది. ఆర్టీసీ చైర్మన్ పోస్టు కూడా ఖాళీ కానుంది. దీంతో... నామినేటెడ్ పదవులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని కిరణ్ భావిస్తున్నారు. చాలా పదవులు ఉన్నప్పటికీ ఏపీఐఐసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, ఏపీఐడీసీ, మార్క్‌ఫెడ్, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, మహిళా ఆర్థిక సంస్థ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ, మైనారిటీ ఆర్థిక సంస్థ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ తదితర సంస్థలకు కీలక ప్రాధాన్యం నెలకొంది. ఈ పదవుల భర్తీకి అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలిసింది.


