TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో సునీతకు షాక్.. పిటిషన్ కొట్టివేత.. !

Published on: Fri Jul 24, 2026 6:01PM

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు దర్యాప్తుపై సీబీఐ సమగ్రంగా వ్యవహరించలేదని, మరిన్ని కోణాల్లో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. వివేకా దారుణ హత్యపై సీబీఐ అధికారులు సరిగ్గా దర్యాప్తు చేయడంలేదని, పలు కీలక అంశాలను విస్మరించారని సునీతా రెడ్డి గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అర్జీపై నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఇరుపక్షాల వాదనలను విచారించింది.

సునీత పిటిషన్‌పై సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా విచారించామని, ఆధారాలు సేకరించి సమగ్ర ఛార్జ్‌షీట్‌ను కూడా కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. అయితే, న్యాయస్థానం ఆదేశిస్తే మళ్లీ విచారణ చేపట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇరువైపులా దాఖలైన వాదనలు, ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ కేసులో మళ్లీ ప్రత్యేకంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో దర్యాప్తును పునరుద్ధరించాలన్న సునీతా రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది.

2019 శాసనసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం విధితమే. మొదట రాష్ట్ర పోలీసులు విచారించిన ఈ కేసు, ఆ తర్వాత సీబీఐకి బదిలీ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను ఏపీ నుంచి తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు మార్చారు. కేసు నమోదు అయినప్పటి నుంచి తన తండ్రి హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటకు రావాలని సునీత సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ కోర్టు ఇచ్చిన ప్రస్తుత తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నాంపల్లి కోర్టు తీర్పు నేపథ్యంలో సునీతా రెడ్డి తదుపరి చట్టపరమైన చర్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కింది కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ కీలక కేసులో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

YS Viveka Murder Case, Sunitha Reddy Petition, Nampalli CBI Court, Viveka Case Latest News, AP Politics News