19 నుంచి విజ‌య‌మ్మ దీక్ష

 

రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో వైసిపి మ‌రో అడుగు ముందుకు వేసింది. ఇన్నాళ్లు తాము విభ‌జ‌న వ్యతిరేకం కాదు అన్న ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు స‌మైక్య రాష్ట్రం కోసం ప్రత్యక్ష యుద్దంలోకి దిగుతున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రక‌ట‌న నేప‌ధ్యంలో ముందుగా రాజీనామాలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీమాంద్రల్లో హీరోలుగా మారారు. ఇదే ఊపులో ఇప్పుడు స‌మైక్యాంద్ర ఉద్యమ క్రెడిట్ అంత త‌మ ఖాతాలో వేసుకోవాల‌నుకుంటుంది ఆపార్టీ.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర‌వ‌ధిక దీక్షకు దిగ‌నున్నారు. ఈ నెల 19 నుంచి విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి ఇరు ప‌క్షాల‌కు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని స‌మైక్యంగా ఉంచాలని డిమాండ్‌తో ఆమె దీక్షకు దిగ‌నున్నారు.

రాష్ట్రవిభ‌జ‌న విష‌యం కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్షంగా తీసుకుంద‌ని విమ‌ర్శిస్తూ వ‌స్తున్న వైసిపి ఇప్పుడు ప్రత్యక్షంగా నిర‌స‌న‌లు చేయ‌డానికి రెడీ అవుతుంది. రాజకీయ అబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర విభజన తప్పనిసరైతే కేంద్రం ఓ తండ్రిలా వ్యవహరించి రెండు ప్రాంతాలకు సమ న్యాయం చేయమని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తుంది.