విజయమ్మతో యుద్ధానికి కాంగ్రెస్ కొత్త అస్త్రాలు?
Published on: Thu May 31, 2012 10:40AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మతో మాటల యుద్ధానికి కాంగ్రెస్ కొత్త అస్త్రాలను ఎంచుకుంటోంది. ప్రత్యేకించి తమ పార్టీలోని మహిళల్లో వక్తలూ, సమయస్ఫూర్తిగా మాట్లాడే నేర్పు ఉన్న వారిని ఎంపిక చేస్తోంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే సినీనటి జయసుధ పేరును తెరపైకి వచ్చింది. ఈమెను సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ ఎంపిక చేశారు. జయసుధను రాజకీయతెరకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పరిచయం చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఆమె గెలుపునకు బాటలు వేశారు. అందుకని ఆ విశ్వాసంతోనే జయసుధ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధపడి తర్వాత ఆగిపోయారు.
ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని అక్రమాతుల కేసులో అరెస్టు చేశాక విజయమ్మ పార్టీ తరుపున ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసే విమర్శలకు జయసుధ ఇకపై కాంగ్రెస్ తరుపున ఘాటుగా సమాధానమిస్తారు. ఈమె తరువాత విజయమ్మను ఎదుర్కొనేందుకు కేంద్రమంత్రి పురందరేశ్వరి కూడా రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల తన కుమారుడి కోసం అమెరికాలోని యూనివర్సిటీకి వెళ్ళిన ఆమె తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఆమె తిరిగి వచ్చాక విజయమ్మను విమర్శలతో ఎదుర్కొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున ఎంపి రేణుకా చౌదరి, గంగాభవానీ విజయమ్మను ఎదుర్కొనే పనిలో నిమగ్నమయ్యారు. ఓ మహిళను ఎదుర్కొనేందుకు పార్టీలోని మహిళలయితే సరిపోతుందని సిఎం కిరణ్, బొత్సా వ్యూహం ఎంత మేరకు సఫలీకృతమావుతుందో మాత్రం తెరేపైనే చూడాలి.


