ఏప్రిల్ లో షర్మిల పార్టీ!
Published on: Thu Feb 11, 2021 8:13AM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఖరారైంది. పార్టీ కోసం ఆమె ఏర్పాట్లు కూడా వేగంగా చేసుకుంటున్నారు. అయితే షర్మిల పాార్టీని ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. అయితే షర్మిల పార్టీకి సంంబంధించి కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్ 10న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. షర్మిల కూడా ఏప్రిల్ 10నే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
వైఎస్ సెంటిమెంట్ గా భావించిన చేవెళ్లలోనే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఆ రోజునే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సభకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను సమీకరించాలని నిర్ణయించారట. ఆ రోజున పార్టీ కనుక ప్రకటించకుంటే, అదే రోజున చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ లోపు పార్టీ జెండా, విధివిధానాలను ఖరారు చేయాలని వైఎస్ షర్మిల ముందుకు వెళుతున్నట్లు సమాచారం.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటుపై దూకుడు పెంచారు .మంగళవారం లోటస్ పాండ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమై చర్చించిన షర్మిల.. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 20న ఆమె ఖమ్మంకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో గతంలో వైసీపీ బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అందుకే మొదటగా షర్మిల.. ఖమ్మం జిల్లాపైనే ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. కొత్త పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్ లో విశాలమైన భవనాన్ని తీసుకుంటున్నారని సమాచారం.


