ఎందుకు? ఏమిటి? ఎలా? ఇవేమీ లేకుండానే షర్మిలక్క ట్వీట్..
Published on: Mon Jun 28, 2021 7:36PM
అక్క మరోసారి క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరికీ వ్యతిరేకంగా కాదని... కేవలం అదికారమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది. ఊరు మార్చింది కాని...తీరు మారలేదు. ఈ ఒడ్డుకొచ్చి.. ఆ ఒడ్డు మీద వారి పేర్లు కూడా చెప్పకుండా పోరాటం చేస్తామనడం మేడమ్ కే చెల్లింది. అసలు అన్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం కూడా చెప్పలేదు. తెలంగాణకొచ్చే చుక్క నీరు కూడా వదలరట...దాని కోసం ఎవరితోనైనా పోరాడతారంట... ఇది షర్మిల మేడమ్ ట్వీట్. ఈ ట్వీట్ పెట్టడానికి కూడా చాలా టైమ్ తీసుకుంది అక్క.
ఆర్డీఎస్ కుడికాలువ గొడవ ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ చిచ్చు రేపింది. తాము ప్రాజెక్టు నిండాకే నీళ్లు తీసుకెళ్లడానికే కుడికాలువ నిర్మిస్తున్నట్లు ఏపీ వాదిస్తుంది. అయితే దానికి అనుమతి లేదని..దిగువ ప్రాజెక్టులు నిండకుండానే..వచ్చినవి వచ్చినట్లు నీళ్లు గుంజుకోవడానికే ఈ పని చేస్తున్నారని తెలంగాణ చెబుతోంది. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ముందు ప్రశాంత్ రెడ్డి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఏపీపై మండిపడ్డారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఆంధ్రోళ్లు అనే పదాలు కూడా వచ్చాయి. అయితే దీని మీద ఏపీ మంత్రులు మాత్రం మెత్తగానే మాట్లాడుతూ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఏపీలోని ప్రతిపక్షాలు కూడా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం ఆపకూడదని డిమాండ్ చేస్తున్నాయి.
వ్యవహారం ఇలా నడుస్తుంటే..న్యూఎంట్రీ షర్మిల ఒక ట్వీట్ చేశారు. ఆమె వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి..ఇక్కడ మాత్రం తెలంగాణ కోడలినని చెబుతోంది. తెలంగాణ కోసమే తాను పుట్టానన్నంత రేంజ్ లో డైలాగులు వదులుతూ..రాజకీయ ప్రస్థానం సాగించాలని చూస్తున్నారు.ఇప్పుడీ జలవివాదం కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ఏపీ తప్పు చేస్తుందని చెప్పలేరు.. పైగా రాయలసీమ బిడ్డ..ప్రాజెక్టు అక్కడిదే. జగనన్నను అసలే అనలేరు. అలా అని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సైలెంటుగా ఉంటే రాజకీయంగా నష్టం. అందుకే అటు ఇటు కాకుండా తెలంగాణకొచ్చే చుక్కనీరు వదులుకోం.. ఎవరితోనైనా పోరాటానికి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు.

ఇక్కడ ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం సరైందో కాదో చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తుందో ఒప్పు చేస్తుందో చెప్పలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనీ చెప్పలేదు. అవన్నీ లేకుండా పోరాటమనే ట్వీట్ మాత్రం చేసేశారు. ఇదే ఇప్పుడు కామెడీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై కామెంట్లు మొదలయ్యాయి. మొదటి నుంచి ఆవిడేదో జగనన్నతో గొడవపడి వచ్చినట్లు... తెలంగాణ ఏదో మేడమ్ కు బాకీ ఉన్నట్లు..ఇక్కడికొచ్చి పార్టీ పెడుతున్నట్లు చెప్పడం..హైప్ కోసం రకరకాల హైడ్రామాలు నడిపించడం..అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కి ఏదో తానే ప్రత్యామ్నాయం అన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ డైలాగులు వదులుతుండటం..ఇవన్నీకూడా జనానికి అర్ధం కాకుండా ఉన్నాయి. ఆమె లక్ష్యం అధికారమే..ఈమె ఎవరికి మేలు చేస్తుంది..ఎవరికి నష్టం చేస్తుందనే విశ్లేషణలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఆర్డీఎస్ జల వివాదంపై మేడమ్ ట్వీట్.. ఆమె వైఖరి ఏంటో... ఆమె ప్రోగ్రామ్ ఏంటో అర్ధమయ్యేలానే ఉన్నాయి.


