TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిల పార్టీ ఆఫీసుకు తాళం.. ప్రారంభించకుండానే క్లోజ్!

Published on: Sun May 16, 2021 10:00AM

ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తెచ్చేసిన ‘రాజన్న రాజ్యాన్ని’ తెలంగాణలోనూ తెచ్చేందుకు నడుం బిగించిన వైఎస్ షర్మిల రాజకీయ సంకల్పానికి బ్రేక్ పడింది. రాజన్న రాజ్యం లక్షంగా పార్టీ ఏర్పాటు సన్నహాలు చురుగ్గా సాగుతున్న సమయంలో రాష్ట్రంపై  కరోనా పంజా విసిరింది. అప్పటి నుంచి కరోనా కేసులు, కొవిడ్ మరణాలు భయంకరంగా పెరిగి పోతున్నాయి. దీంతో, రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ప్రజలే కాదు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా గడపదాటి బయటకు రావడానికి భయపడుతున్నారు. 

ఇతర పార్టీల వ్యవహారం ఎలా ఉన్నా, ఇంకా పేరైనా పెట్టని షర్మిల పార్టీకి, పురిటిలోనే సంధి కొట్టినట్లు అయింది.  అంతవరకు జోరుగా సాగిన ఆత్మీయ సమావేశాలు, జగనన్న అడుగుజాడల్లో ఆమె చేపట్టిన దీక్షలకు బ్రేక్ పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే,అంతవరకు కళకళలాడిన షర్మిల రాజకీయ కార్యకలాపాల వేదిక, లోటస్ పాండ్’కు తాళం పడింది. మరో వంక కరోనా నిబంధనలు పాటించకుండా కనీసం మాస్క్ అయినా  లేకుండా ఆత్మీయ సమ్మేళనాలు, ఖమ్మం సంకల్పసభ, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఉద్యోగ దీక్షలో పాల్గొన్న, అనేక మందికి కరోనా సోకింది. కొవిడ్ బారిన పడ్డారు. ఆమె  ముఖ్య అనుచరులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతే కాకుండా కరోనా నిబంధనలు పాటించకుండా, ప్రతిరోజూ చిన్న పెద్ద సభలు, సమావేశాలు నిర్వహించడం వల్ల అనేక మంది కరోనా బారిన పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో  షర్మిల, రాజకీయ కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌కు తాళం వేశారు. 

ప్రస్తుతం షర్మిల సోషల్ మీడియా వేదికగా రాజకీయం సాగిస్తున్నారు. అడపా తడపా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. మరో వంక ఆమె ప్రారంభించిన ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యక్రమం ప్రారంభానికి ముందే పడకేసిందనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. కరోనా సోకి ఇంటి పెద్ద దిక్కును పోల్పోయిన వారికి పెద్దాయన వైఎస్సార్’ పేరున సహాయం చేసేందుకు ఉద్దేశించిన పథకం ప్రారంభానికి ముందే పడకేసిందన్నవిమర్శలు వినవస్తున్నాయి. సహాయం కావలసిన వారు, సహాయం కోరేందుకు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే, తిరిగి కాల్ వస్తుందనే రికార్డెడ్ వాయిస్ మినహా ఎలాంటి మానవ స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు.మొత్తానికి, షర్మిల రాజకీయ కలలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది.