జగనన్న బాణం రివర్సైందా! వైసీపీలో ఎందుకా కలవరం ?
Published on: Tue Feb 9, 2021 4:24PM
వైఎస్ కుటుంబం చీలిపోయిందా? జగన్, షర్మిల మధ్య కొంత కాలంగా మాటలే లేవా? జగనన్న వదిలిన బాణం టార్గెట్ ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడం ఖాయమైంది. చేవెళ్లలో ఆమె పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ నేత రాఘవరెడ్డి ప్రకటించారు. అయితే ఆ తేదీ ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. వైఎస్ షర్మిల తాజా అడుగులతో వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తెలుస్తోంది. తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా.. షర్మిల కొత్త పార్టీ పెడుతుండటమే సంచలనం కాగా... అభిమానులతో సమావేశం సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు మరింత కాక పుట్టిస్తున్నాయి.
లోటస్ పాండ్ లో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. షర్మిల మాటలను బట్టి జగన్ తో ఆమె కొంత కాలంగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టడమంటే సామాన్య విషయం కాదు. కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. కాని షర్మిల మాత్రం ఏపీ సీఎంగా ఉన్న తన అన్నతో కనీసం చర్చించకుండానే పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యాయని చెప్పడం విస్మయం కల్గిస్తోంది. అంటే జగన్ తీవ్రమైన విభేదాలు ఉన్నాయి కాబట్టే... అత్యంత కీలకమైన పార్టీ ఏర్పాటు విషయాన్ని షర్మిల అతనితో చెప్పలేదని భావిస్తున్నారు. జగన్ తో మీకు విభేదాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు కూడా షర్మిల ఆసక్తికర సమాధానమే ఇచ్చారు. రాజకీయంగా తన దారి తనదేనని తేల్చి చెప్పారు షర్మిల. దీంతో జగన్ తో ఆమెకు గ్యాప్ భారీగా పెరిగిందనే అనుమానులు బలపడుతున్నాయి.
పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అంగీకరించారు. తెలంగాణలో పార్టీ ఎందుకు ఉండకూడదన్న అంశంపై గత మూడు నెలలుగా వైఎస్ కుటుంబంలో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఏపీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో పార్టీ వద్దని జగన్ సూచించారని, అయితే తెలంగాణలో మరో పార్టీ స్థాపించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల మధ్య ఉన్నది భిన్నాభిప్రాయాలేనని.. అంతేతప్ప అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో తమ పార్టీ వద్దని సీఎం జగన్ దృఢ నిర్ణయంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల సొంత నిర్ణయం అని వివరణ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
వైఎస్ అభిమానుల ఆత్మీయ సమావేశం, షర్మిల తాజా కామెంట్లు, వైసీపీ ముఖ్య నేతల రియాక్షన్లు.. అంతా గమనిస్తే... వైఎస్ షర్మిల సొంతంగానే పార్టీ దిశగా అడుగులు వేస్తుందని స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాకా జగన్ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారు. గత టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాలకు రివర్స్ టెండర్లు చేపట్టారు. దీంతో జగన్ పాలనా అంతా రివర్స్ లో నడుస్తుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగనన్న వదిలన బాణం కూడా రివర్సైందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ గెలుపు కోసం జగనన్న వదలిన బాణం... ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీగా మారి... అన్నకే సవాల్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.


