TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిల రాజకీయభవిష్యత్తుకి బాటలుపరిచిన మరో ప్రజా ప్రస్థానం

Published on: Wed Jul 17, 2013 8:37PM

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చేప్పటిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నిన్నటితో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కోమటిపల్లి వద్ద 2818కి.మీ. మైలురాయి దాటింది. ఆమె ఈ దూరాన్ని కేవలం 211 రోజుల్లో పూర్తిచేసారు. ఇదివరకు చంద్రబాబు 208 రోజుల్లో 2817 కి.మీ. చేసిన తన పాదయాత్రని విశాఖలో ముగించారు. ఆమె చంద్రబాబు నెలకొల్పిన ఈ రికార్డుని అధిగమించి నిర్విరామంగా ముందుకు సాగిపోతున్నారు.

 

ఆమె ఇంత వరకు 13జిల్లాలకు చెందిన 40 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లు, 108 నియోజకవర్గాలు, 184 మండలాలు, 1,784 గ్రామాలను తన పాదయాత్రలో సందర్శించారు. షర్మిల తన పాదయాత్ర మొదలుపెట్టిన నాటినుండి ఇంతవరకు 155 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆమె తన పాదయాత్రను తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించనున్నారు.

 

ఇంత సుదీర్గమయిన పాదయాత్ర చేసిన దేశంలో మొట్ట మొదటి మహిళగా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె తన పాదయాత్రను ప్రధానంగా తన పార్టీని బలపరిచి ప్రజలలో వ్యాపింప జేయడానికి, తన తండ్రి, సోదరుల పట్ల ప్రజలలో ఉన్న సానుభూతిని సజీవంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తమకు ప్రధాన శత్రువయిన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించేందుకు ఉపయోగించుకొంటున్నారు.

 

ముందే చెప్పినట్లు ఇంత సుదీర్గయాత్ర చేసి రాష్ట్రంలో మారుమూల గ్రామాలను సైతం సందర్శించిన షర్మిల, అదే సమయంలో తన పార్టీ నిర్మాణానికి కూడా పూనుకొని ఉంటే, తన యాత్రవల్ల వైకాపా పూర్తి ప్రయోజనం పొంది ఉండేది. కానీ ఆమె కేవలం ప్రభుత్వ, ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోవడం వలన ఆమె పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని వృధా చేసుకొన్నట్లయింది. అందుకు ప్రధానంగా వైకాపాకు శల్యసారద్యం చేస్తున్నఆ పార్టీ సీనియర్లనే నిందించకతప్పదు. ఆమె పాదయాత్రను పార్టీకి పూర్తి ప్రయోజనం చేకూర్చేవిధంగా మలిచి, ఎక్కడికక్కడ ఆమె పార్టీ శ్రేణులతో సమావేశపరచి, పార్టీ నిర్మాణం జరిగేలాచేసి ఉంటే ఆమె పాదయత్ర ముగిసేసరికి, వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాశక్తిగా మారిఉండేది. కానీ ఆమే స్వయంగా చెప్పుకొన్నట్లు ‘జగనన్న విడిచిన బాణం’లా రివ్వున దూసుకుపోవడం వలన వైకాపాకి పెద్దగా ఒరిగిందేమీ లేదు.

 

అయితే, మున్ముందు ఆపార్టీలో కీలక బాధ్యతలు చెప్పటేందుకు ఆమెకు అవసరమయిన అనుభవం, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల చక్కటి అవగాహన ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో తమ పార్టీ వాస్తవ పరిస్థితి కూడా ఆమె స్వయంగా తెలుసుకోగలిగారు. అందువల్ల ఒకవేళ రానున్న ఎన్నికలలోగా జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కాకపోతే, వైకాపాకి ఆమె మాత్రమె ఒక ప్రత్యామ్నాయ అధినేతగా నిలిచేందుకు ఈ పాదయాత్ర ద్వారా అర్హత సాధించారు.

 

ప్రస్తుతం పార్టీకి శల్యసారధ్యం చేస్తున్న సీనియర్ నేతలను, పదవులకోసం కీచులాడుకొంటున్న నేతలను షర్మిల తన దారికి తెచ్చుకొని, పార్టీకి దిశానిర్దేశ్యం చేయగల అనుభవం గడించారని ఖచ్చితంగా చెప్పవచ్చును.