TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కోదండకు షర్మిల ఆహ్వానం.. రేవంత్ రాకతో మారిన వ్యూహం

Published on: Tue Jul 6, 2021 12:02PM

ఇన్నాళ్లూ ష‌ర్మిల‌ది వ‌న్ ఉమెన్  షో న‌డిచింది. ఆమె స్పీచ్‌లు ఆమె ఇచ్చుకునేది. ఆమె చేయాల‌నుకున్న‌ విమ‌ర్శ‌లు చేసేది. ఆమె పెట్టాల‌నుకున్న స‌భ‌లు పెట్టేది. ధ‌ర్నాలు, దీక్ష‌లు, ప‌రామ‌ర్శ‌లు, ఓదార్పు యాత్ర‌లు.. అంతా ఆమె ఇష్టం. ఓ మీడియా స‌హ‌కారంతో కొన్నాళ్ల పాటు మ‌స్త్ హ‌డావుడి చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఎవ‌రూ పిల‌వ‌క‌ముందే రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ మైకు ప‌ట్టుకొని ముందుకొచ్చారు. ఎవ‌రూ అడ‌గ‌క‌ముందే తాను తెలంగాణ కోడ‌లినంటూ జ‌స్టిఫికేష‌న్ కూడా చేసేసుకున్నారు. అయితే.. ఆమె ఎంత మొత్తుకుంటున్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. రివ‌ర్స్ కౌంట‌ర్లు మాత్రం ప‌డేవికావు. రాజ‌కీయాల్లో ఒక్క విమ‌ర్శ చేస్తే.. క్ష‌ణాల్లోనే ప్ర‌తివిమ‌ర్శ‌లు దాడి చేస్తాయి. అలాంటిది.. ష‌ర్మిల ఎంత‌గా గొంతు చించుకుని అరిచినా.. ఎవ‌రికీ చీమ కుట్టిన‌ట్టు కూడా అనిపించ‌లేన‌ట్టుంది. అందుకే, ఇటు టీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ.. ష‌ర్మిల రాజ‌కీయ ఉనికిని అస‌లేమాత్రం గుర్తించ‌లేదు. సో.. ఇన్నాళ్లూ తెలంగాణ పొలిటిక‌ల్ డ‌యాస్ మీద వైఎస్ ష‌ర్మిల వ‌న్ ఉమెన్ షో జ‌బ‌ర్ద‌స్త్‌గా సాగింది. 

క‌ట్ చేస్తే.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కం. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిన‌ట్టు.. రేవంత్ ప‌ద‌వి ష‌ర్మిలపై పిడుగులా ప‌డింది. వ‌చ్చీ రాగానే.. రేవంత్.. కేసీఆర్‌, బండి సంజ‌య్‌లతో పాటు ష‌ర్మిల‌నూ ఓ ఆట ఆడుకున్నారు. ష‌ర్మిల పార్టీ వెనుక కేసీఆర్‌, జ‌గ‌న్‌ల కుట్ర ఉందంటూ తేల్చేశారు. టీఆర్ఎస్‌, బీజేపీలు ష‌ర్మిల పార్టీ విష‌యంలో ప‌ట్టించుకోన‌ట్టు న‌టించినా.. దాని వెనుక వారికి లాభ‌మే ఉంద‌నే లెక్కొక‌టి వినిపిస్తోంది. ష‌ర్మిల‌తో అయితే గియితే డ్యామేజీ అంతా కాంగ్రెస్‌కే జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కాంగ్రెస్‌కు న‌ష్టం అంటే.. అది రేవంత్‌రెడ్డికి మైన‌స్‌. అందుకే, ష‌ర్మిల‌కు ఆదిలోనే పుల్‌స్టాప్ పెట్టాల‌ని.. వ‌చ్చీ రాగానే వైఎస్సార్ కూతురునూ వ‌దిలిపెట్ట‌కుండా విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో ఉండే వైఎస్సార్ అభిమానులు, రెడ్డి నాయ‌కులు, సీమ వాసులు, మైనార్టీ వ‌ర్గాలు.. రేవంత్‌రెడ్డి వైపు మ‌ళ్ల‌కుండా.. వారిని ష‌ర్మిల వైపు షిఫ్ట్ చేయాల‌నే ఎత్తుగ‌డ‌తోనే కేసీఆర్‌-జ‌గ‌న్‌లు క‌లిసి ష‌ర్మిల‌తో పార్టీ పెట్టించార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. అందుకే, చిన్న‌పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌నే సామెత ప్రకారం.. టీఆర్ఎస్‌, బీజేపీలు ప‌ట్టించుకోకున్నా.. రేవంత్‌రెడ్డి మాత్రం ష‌ర్మిల‌పై పొలిటిక‌ల్ అటాక్‌కు దిగారు. 

ఇక‌, రేవంత్‌రెడ్డి వ‌స్తే తెలంగాణ‌లో త‌న కొంప కొల్లేరు అవుతుంద‌నే టెన్ష‌న్ ష‌ర్మిల‌లో పెరిగిపోయింద‌ని అంటున్నారు. అందుకే, రాజ‌కీయంగా మ‌రింత దూకుడు పెంచారు ష‌ర్మిల‌. ఆఘ‌మేఘాల మీద ప్ర‌శాంత్‌కిషోర్ శిష్యురాలు, త‌మిళ‌నాడులో ఓ మీడియా హౌజ్ న‌డిపించే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ను త‌నకు అడ్వైజ‌ర్‌గా పెట్టుకున్నారు. ఆమె స‌హ‌కారంతో రాజ‌కీయ వ్యూహాలు ర‌చించి.. తెలంగాణ‌లో ఎద‌గాల‌ని భావిస్తున్నారు. ఇటు రేవంత్‌రెడ్డితోనే ప్రాబ్ల‌మ్ ఉంద‌ని అనుకుంటుండ‌గా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ఆమెకు మ‌రింత త‌ల‌నొప్పిగా మారిందంటున్నారు. 10 రోజులుగా నానా ర‌చ్చ న‌డుస్తుంటే.. ష‌ర్మిల ఇంత వ‌ర‌కూ జ‌ల‌జ‌గ‌డంపై నోరు విప్ప‌నే లేదు. చాలా తెలివిగా.. నాలుగు నెల‌ల క్రితం మాట్లాడిన పాత‌ వీడియోలోని త‌న ప్ర‌సంగాన్ని.. ఇప్పుడు కొత్త‌గా ట్వీట్ చేస్తూ.. తాను అదే స్టాండ్‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ కోసం ఎవ‌రితోనైనా కొట్లాడ‌తా.. ఒక్క నీటి చుక్క‌నూ వ‌దులుకోమంటూ.. ట్వీట్ చేసి.. ఇక ఇప్ప‌టికింతే సంగ‌తులంటూ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు ష‌ర్మిల‌. ఆమె మౌనం.. మ‌రింత అనుమానాస్ప‌దం అవుతోంది. ఈమెక‌స‌లు తెలంగాణ‌పై చిత్త‌శుద్ధి ఉందా.. అనే డౌట్ చాలామందిలో...

అందుకే, ఆ డౌట్‌ను క్లియ‌ర్ చేయాలంటే.. తాను తెలంగాణ‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌జ‌ల‌కు అనిపించేలా.. త‌న‌పై తెలంగాణ ముద్ర మ‌రింత ప‌డేలా.. త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ష‌ర్మిల‌. జులై 8న‌.. పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా.. ప‌లువురు తెలంగాణ ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి.. వేదిక‌పై వారితో క‌లిసిపోయి.. తానూ తెలంగాణ వాదినేన‌ని అనిపించేలా ప్ర‌ణాళిక‌లు రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణ‌వాదానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ లాంటి వారైన కోదండ‌రాం సార్‌ను YSRTP ఆవిర్భావ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు ఆ పార్టీ ప్ర‌తినిధులు. వీరైతే బొట్టుపెట్టి మ‌రీ పిలిచారు కానీ.. మ‌రి, సార్ వ‌స్తోరో.. రారో.. వ‌స్తే మాత్రం ష‌ర్మిల‌పై తెలంగాణ‌వాదుల‌కు కాస్త న‌మ్మ‌కం ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఇలా.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్‌తో త‌న‌ను తాను తెలంగాణ‌వాదిగా.. త‌న‌కు తెలంగాణ‌పై క‌మిట్‌మెంట్‌తో ఉన్నాన‌ని.. త‌ప్ప‌క నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వైఎస్ ష‌ర్మిల‌ది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ఎంట్రీతో ముందుముందు ష‌ర్మిల‌ రాజ‌కీయం ఇంకెంత రంజుగా ఉంటుందో చూడాలి...