సిబీఐ వైఖరిపై రాష్ట్రంలో చర్చ
Published on: Sat Apr 21, 2012 10:29AM
జగన్ కేసు విషయంలో సిబీఐ అనుసరిస్తున్న వైఖరి, హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ కొనసాగుతోంది. జగన్ అక్రమ ఆస్తుల కేసుల విషయం, ఓబులాపురం మైనింగ్ కేసుల విషయంలో సిబీఐ దర్యాప్తు చేసిన తీరు, ఇందుకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి, మాజీమంత్రి గాలి జనార్థనరెడ్డి అరెస్టు వంటి అంశాలపై ప్రజలు చాలా గొప్పగా చెప్పుకొన్నారు. సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఒక హీరోలా భావించారు. రాజకీయాలకు అతీతంగా కేసు దర్యాప్తు జరుగుతుందని కూడా అభిప్రాయపడ్డారు.
కాని రాను రాను జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయంలో ముద్దాయిలుగా పేర్కొన్న వారిని అరెస్టు చేయడంలో జాప్యం చేయడం, కేవలం ఒక్క విజయసాయిరెడ్డిని మాత్రమే అరెస్టు చేయడం పట్ల ప్రజలు సిబీఐ వైఖరిపై చర్చించుకుంటున్నారు. అక్రమ ఆస్తుల కేసు విషయంలో సిబీఐ జగన్ ను మొదటి నిందితుడిగా, విజయసాయిరెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నది. మొదటి నిందితుడు స్వేచ్చగా తిరుగుతుండగా రెండో నిందితుడిని అరెస్టు చేయడం, అతనికి బెయిల్ మంజూరు కాకుండా అడ్డుపడటం వంటి అంశాలు ప్రజలలో ఆసక్తిని, అనుమానాలను కలిగిస్తున్నాయి. దీనికి తోడు హైకోర్టు కూడా ఇదే విషయంపై నేరుగా సిబీఐని ప్రశ్నించడంతో ప్రజలకు ఈ అంశంపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రతిపక్షానికి చెందిన నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ ల మధ్య సంబంధబాంధవ్యాలు కొనసాగుతున్నాయనే వార్తలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు.


