జగన్‌కు "బాణం" గుచ్చుకుంటుందా..?

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన కొత్తల్లో అధినేత జగన్ జైలు పాలైతే.. కార్యకర్తలు చేజారకుండా.. పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు వైఎస్ షర్మిల. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ చంద్రబాబు నాయుడిపై బహిరంగ సభల్లో నిప్పులు చెరిగారు. ఆమె పాదయాత్ర ఫలితంగానే జగన్ జైలులో ఉన్నప్పటికీ.. వైసీపీ కోలుకోగలిగిందనేది ఓపెన్ సిక్రెట్. షర్మిల 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, ఖమ్మం లేదా మరో సిటీ నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది.

 

అయితే ఆమెను సరిగ్గా ఎన్నికలకు ముందు పక్కనపడేయటంతో.. షర్మిల, అనిల్‌లు తర్వాత వార్తల్లో కనిపించలేదు. పార్టీకి ఇంత చేస్తే.. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వడా అంటూ షర్మిల కాస్త మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎన్నికల సీజన్ దగ్గరపడుతుండటం.. పార్టీలో తాను తప్ప మరో స్టార్ క్యాంపెయినర్ లేకపోవడంతో.. జగన్‌కు మళ్లీ షర్మిల అవసరం పడింది.

 

ఈ నేపథ్యంలో అమ్మ విజయమ్మ సాయంతో షర్మిలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత తీవ్రంగా శ్రమిస్తున్నారట. అయితే ఈసారి తనకు కడప ఎంపీ టిక్కెట్ కావాల్సిందేనని గత ఎన్నికల్లో లాగా వాడుకుని వదిలిస్తే.. ఊరుకునేది లేదని అల్టీమేటం జారీ చేసిందట. ప్రస్తుతం బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి అతన్ని జమ్మలమడుగుకు పంపించి.. తమకు కడపని ఫిక్స్ చేయాలని షర్మిల దంపతులు ఇప్పటికే జగన్‌తో చెప్పారట. అన్న నుంచి స్పష్టమైన హామీ వస్తేనే గానీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని షర్మిల గట్టిగా.. ఫిక్సయ్యారని లోటస్ పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.