పీకే కోసం కార్యకర్తలకు దూరమవుతున్నాడా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి తొలి నుంచి ఎవరికీ అంతుపట్టడం లేదు.. కాకలు తీరిన రాజకీయ నాయకుల నుంచి నిన్న మొన్న పొలిటిక్స్‌లో ఓనమాలు నేర్చుకున్న వారికి సైతం ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మకుండా.. ఏం చెప్పినా వినకుండా.. తనకు తోచింది చేయడం జగన్ నైజం. ఈ వైఖరి వల్ల ఆయనతో ఇమడలేక వైసీపి నుంచి ఎంతో మంది నేతలు బయటకు వచ్చేశారు.

 

వచ్చిన ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట రావడం ఆశ్చర్యకరం. అలాంటి జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ మాటను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ప్రజా సంకల్ప యాత్ర, నవరత్నాలు, మద్యపాన నిషేధం వంటివి అందులో భాగమేనని లోటస్ పాండ్ టాక్. కానీ పార్టీలోని కొందరు నేతలకు, కార్యకర్తలకు ఇది నచ్చడం లేదు.. పార్టీ స్థాపించిన నాటి నుంచి వెంట నడిచిన మమ్మల్ని కాదని.. నిన్న గాక మొన్న వచ్చిన ప్రశాంత్ కిశోర్ మాటలకు అధినేత ఎక్కువ విలువ ఇవ్వడం పట్ల వారు మనస్తాపానికి గురవుతున్నారు.

 

అంతేకాకుండా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ అక్కడి స్థానిక సమస్యలు తెలుసుకోకుండా.. ప్రశాంత్ జోక్యం చేసుకోవడం పట్ల నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా అధినేత వద్ద తమ ఆవేదన వ్యక్తం చేయలేక పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిణామాలు క్యాడర్‌ని జగన్‌కి దూరం చేసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా అధికార పార్టీ గూటికి చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలను కూడా దూరం చేసుకుంటే.. జగన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. మరి జగన్ కార్యకర్తలకు దూరమవుతాడా..? పీకే‌కి ప్రాధాన్యత తగ్గిస్తాడా అన్న దానికి కాలమే సమాధానం చెబుతుంది.