జగన్‌ ఆపరేషన్‌ రివర్స్‌... టీడీపీలో మెయిన్‌ లీడర్లే టార్గెట్‌

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌‌కు విరుగుడుగా వైసీపీ రివర్స్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించింది. ఎక్కడ పోగొట్టుకున్నామో... అక్కడే రాబట్టుకోవాలనుకుంటోన్న వైసీపీ... తెలుగుదేశంలో అసంతృప్తులను గుర్తించి.... పార్టీలోకి రప్పించేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్‌ ఫోకస్‌ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల చేరికతో ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం లీడర్లను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

 

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు చె‌క్‌ పెట్టేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన జగన్‌.... తాజాగా నంద్యాలపై ఫోకస్‌ పెట్టారు. నంద్యాల టీడీపీ టికెట్‌ కోసం పట్టుబడుతూ, చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్న శిల్పామోహన్‌రెడ్డిని వైసీపీలోకి రప్పించి, ఉపఎన్నికల బరిలోకి దింపాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు శిల్పామోహన్‌రెడ్డితో జగనే నేరుగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఒకవేళ శిల్పాకి నంద్యాల టీడీపీ టికె‌ట్‌ ఇవ్వకపోతే.... వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఇక జగన్ సొంత జిల్లా కడపలోనూ అసంతృప్తితో రగిలిపోతున్న తెలుగుదేశం నేతలకు గాలమేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు రామసుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ప్రజాదరణ ఉండి.... తెలుగుదేశంలో ప్రాధాన్యత లభించక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలపై వైసీపీ ఫోకస్‌ పెట్టింది. ఇక టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తెలుగుదేశంలో ఇమడలేక.... మరికొందరు హామీలు, మంత్రి పదవులు దక్కక... తిరిగి జగన్‌ వైపు చూస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇలా తిరిగి వైసీపీ వైపు చూస్తోన్న ఎమ్మెల్యేలపైనా జగన్‌ దృష్టిపెట్టారు. మరి వైసీపీ రివర్స్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి