TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను టార్గెట్ చేస్తే వోట్లు రాలతాయా?

Published on: Thu Jun 7, 2012 12:25PM

పార్టీల ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైంది. కొద్ది రోజుల్లో ఈ ప్రచార పర్వం ముగియనున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు తమ ప్రత్యర్థులపై చేసే విమర్శలకు పదును పెట్టాయి. ఒకరిని మించి మరొకరు ఘాటుగా విమర్శించుకుంటున్నారు. నిప్పులు చెరిగే ఎండలో విమర్శల వేడిని ఓటర్లకు చవి చూపుతున్నారు. ప్రత్యర్థుల దగాకోరుతనాన్ని ఎండగట్టడంలో పోటీ పెరిగింది. దిగజారుడు పార్టీల జోలికి వెళ్లొద్దనే హితవాక్యాలు కూడా ఘాటుగానే వినిపిస్తున్నాయి. పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలను మూకుమ్మడిగా ప్రచారంలో పాల్గొంటూ విమర్శలను ఎంత పదునుగా వదలచ్చో ద్వితీయశ్రేణికి నేర్పుతున్నారు. నేతల లక్ష్యం (ఒకే పార్టీ అయితే) ఒకటే అయినా వ్యక్తిగతంగా విమర్శించటంలో బాణీలు వేరని చాటుకుంటున్నారు. సిబిఐ విచారణలో ఉన్న వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులూ విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జగన్ ఒక పెద్దటార్గెట్ అయ్యారన్నది వాస్తవం. అలానే ఆ పార్టీకి ఉండే ప్రజాదారణ తగ్గేందుకు విమర్శల్లో కొత్తకోణాలు కూడా వెదుకుతున్నారు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణా అన్న ప్రాంత బేధం లేకుండా నేతలందరూ జగన్ పార్టీపైనే గురిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాంనబీఆజాద్, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పిసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి జగన్ తో పాటు తెలుగుదేశం పార్టీనీ నమ్మోద్దని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

 

 

కాంగ్రెస్ దొంగల పార్టీ అయితే వై.కా.పా. గజదొంగల పార్టీ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు తన ప్రచారంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే బాబు ఆవేశమంతా ముఖం, కళ్లలో కనపడుతుందని, రెప్ప కిందకి వాల్చకుండా ఎంత ఘాటైన పదాలనైనా వదలగలడన్నవిమర్శలకు అభిప్రాయాన్ని ఆయన నిజం చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన తన ప్రసంగంలో పరిటాల రవి హత్య కేసులో జగన్ కుట్రదారుడని ఆరోపించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాల్లో 48మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రి రఘువీరారెడ్డి ఉత్త అబద్దాల కోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న సినీనటి కవిత అయితే చిరంజీవిని మెగారౌడీగా అభివర్ణించారు. ఇక వై.కా.పా. తరుపున ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి, కొండాసురేఖ తదితరులు కాంగ్రెసును ఘాటుగా విమర్శిస్తున్నారు. సినీనటి రోజా తిరుపతి నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గరుండి మరీ తమ పార్టీ అధినేత జగన్ ను అరెస్టు చేయించారని ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ ఓటర్ల ముందు హావభావాలను వ్యక్తీకరిస్తున్నారు. ఇలా పార్టీలు విమర్శల్లో ఘాటు పెంచి ప్రచారానికి ఉన్న కౌంట్ డౌన్ ను లెక్కించుకుంటూ తమ నేతలను నియోజకవర్గాలకు రప్పించుకుంటున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు రౌండ్లు తిరిగిన టిడిపి అధినేత చంద్రబాబు మూడో రౌండ్ కు, అలానే కాంగ్రెస్ నేతలు కూడా మరో రౌండ్ ప్రచారానికి సిద్ధమయ్యారు.